హృద‌య విదార‌కం.. ఐదు రోజుల ప‌సికందును బ‌లిగొన్న ‘ఎండ‌’

ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. డాక్ట‌ర్ల మాట‌లు న‌మ్మి ఓ ప‌సికందును అర గంట పాటు ఎండ‌లో ప‌డుకోబెట్టారు. ఆ త‌ర్వాత ఆ ప‌సి పాప శాశ్వ‌తంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురిలో వెలుగు చూసింది.

  • Publish Date - May 17, 2024 / 08:58 AM IST

ల‌క్నో : ఇది హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. డాక్ట‌ర్ల మాట‌లు న‌మ్మి ఓ ప‌సికందును అర గంట పాటు ఎండ‌లో ప‌డుకోబెట్టారు. ఆ త‌ర్వాత ఆ ప‌సి పాప శాశ్వ‌తంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మెయిన్‌పురిలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మెయిన్‌పురిలోని భుగై గ్రామానికి చెందిన రిటాకు నెల‌లు నిండాయి. దీంతో ఆమెను మెయిన్‌పురిలోని సాయి హాస్పిట‌ల్‌కు కుటుంబ స‌భ్యులు త‌ర‌లించారు. ఐదు రోజుల క్రితం రీటాకు సీజేరియ‌న్ నిర్వ‌హించగా, ఆడ‌బిడ్డ జ‌న్మించింది.

అయితే ప‌సిపాప త‌క్కువ బ‌రువుతో జ‌న్మించింది. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. దీంతో పాప‌ను అర గంట పాటు సూర్య‌ర‌శ్మి త‌గిలేలా ఎండ‌లో ఉంచాల‌ని డాక్ట‌ర్ల‌ను సూచించారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు ఆస్ప‌త్రి టెర్ర‌స్‌పైన ఐదు రోజుల ప‌సికందును ఓ అర గంట పాటు ఉంచారు. ఉద‌యం 11:30 గంట‌ల నుంచి అర‌గంట పాటు ఎండ‌లో ఉంచి, ఆ త‌ర్వాత వార్డులోకి తీసుకొచ్చారు. కాసేప‌టికే పాప‌లో చ‌ల‌నం లేకుండా పోయింది. ప‌సికందు ప్రాణాలు విడిచిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాప‌ను సూర్య‌ర‌శ్మి కోసం ఉంచిన రోజున 42 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఎండ వేడిమికి త‌ట్టుకోలేక‌నే ప‌సికందు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తేలింది.

డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు ప‌సిపాప‌ను అర గంట పాటు ఎండ‌లో ఉంచామ‌ని కుటుంబ స‌భ్యులు తెలిపారు. పాప మృతికి వైద్యుల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని వారు ఆరోపించారు. ఆస్ప‌త్రి యాజ‌మాన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై యూపీ సీఎంవో తీవ్రంగా స్పందించింది. ఆస్ప‌త్రిని సీజ్ చేయాల‌ని సీఎంవో వైద్యారోగ్య శాఖ‌ను ఆదేశించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Latest News