పాట్నా : ఇండియా కూటమి స్థాపనలో కీలకపాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఆ కూటమికి గుడ్‌బై చెప్పనున్నారా? ఇన్నాళ్లూ తాను విమర్శల వర్షం కురిపించిన ఎన్డీయే గూటికే చేరబోతున్నారా? జరుగుతున్న పరిణమాలు, వెలుగులోకి వస్తున్న వార్తలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తున్నది. ఉన్నట్టుండి గురువారం కుటుంబ రాజకీయాలపై తీవ్రస్థాయిలో నితీశ్ ధ్వజమెత్తడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ఇండియా కూటమిలోని ప్రధాన పక్షం కాంగ్రెస్, సొంత రాష్ట్రమైన బీహార్‌లో ఆర్జేడీ కుటుంబ రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ మాటకొస్తే ఇతర భాగస్వామ్య పక్షాలైన ఎన్సీపీ, డీఎంకే, ఎస్పీ వంటి పార్టీలు కూడా కుటుంబ రాజకీయాలు ఉన్నవే. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, తన మార్గదర్శి కర్పూరీ ఠాకూర్ శత జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన నితీశ్.. తన కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రావడాన్ని తాను ఎన్నడూ ప్రోత్సహించలేదని చెప్పారు. కర్పూరీ ఠాకూర్ కూడా ఎన్నడూ తన కుటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురాలేదని అన్నారు. ఈ విషయంలో ఇప్పటి రాజకీయ నాయకులకు ఆయన భిన్నమైన వ్యక్తి అని కొనియాడుతూ తోటి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలపై చురకలు వేశారు. ఇంతసూటిగా నితీశ్ వ్యాఖ్యలు చేయడం వెనుక పెద్ద కథే నడిచిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
జమిలికి లాలూ వద్ద ప్రతిపాదన..
అసెంబ్లీని రద్దు చేసి, లోక్‌సభతోపాటే అసెంబ్లీకీ తాజాగా ఎన్నికలకు వెళదామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తొలుత లాలు ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వద్ద ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం బీహార్‌లో మహాకూటమి ప్రతిష్ఠ బావుందని, మనం తప్పకుండా అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని నితీశ్ బలంగా వాదించారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. వారికథనం ప్రకారం.. ‘ఆర్జేడీ అధినేత అందుకు ససేమిరా అన్నారు. దీంతో బీజేపీ అధిష్ఠాన నేతలతో నితీశ్ సంప్రదించారు. మోదీ ప్రభుత్వం తొలుత జమిలి ఎన్నికల ఆలోచన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జమిలి ఎన్నికలు కాకున్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరో రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తాయనే అభిప్రాయంతో ఉన్న బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అందుకు సమ్మతించి, రాష్ట్ర నేతలను సంప్రదించింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం మొన్నే అసెంబ్లీ ఎన్నికలు అయ్యాయి మళ్లీ ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలా? అంటూ కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించింది. జేడీయూతో పొత్తు కుదిరినట్టయితే మరో ఏడాదిపాటు నితీశ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు అంగీకరించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జమిలి ఎన్నికలకు మాత్రం ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ కేంద్ర నాయకత్వానికి, జేడీయూకు మధ్య విశాల దృక్ఫథంతో కూడిన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జేడీయూ, బీజేపీ చెరొక 17 స్థానాల్లో పోటీ చేస్తాయి’ అని జేడీయూ వర్గాలు వెల్లడించాయి. చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్‌జనశక్తి (రాంవిలాస్)కు, కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాశ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌జనశక్తి పార్టీకి నాలుగు సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఒక సీటును ఉపేంద్ర కుశ్వాహా, జీతన్ రాం మాంఝీకి చెరొక సీటు ఇస్తారని తెలుస్తున్నది. జనవరి 30న పూర్ణియా జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్ర మరుసటి రోజు అంటే జనవరి 30న పాట్నాలో నిర్వహించే కార్యక్రమంలో ఇండియా కూటమి నుంచి వైదొలగుతున్నట్టు నితీశ్ ప్రకటిస్తారని జేడీయూ వర్గాలు చెబుతున్నాయి.