న్యూఢిల్లీ : భారీ సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి పోస్టల్ విభాగం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 44,228కిపైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెబ్ సైట్ indiapostgdsonline.gov.in.లో దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రారంభించారు. ఈ ఉద్యోగాలకు పోటీపడాలనుకునే అభ్యర్థులు తమ ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ ద్వారా వెబ్‌సైట్‌కు లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలి. దరఖాస్తు రుసుం 100 రూపాయలు చెల్లించాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి ఆగస్ట్ 6 నుంచి 8వ తేదీ వరకూ అవకాశం ఇస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ ఆగస్ట్ 5. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు.. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు, దరఖాస్తు విధానం, అర్హులు, నెల వేతనం తదితర వివరాల కోసం ఇండియా పోస్టాఫీస్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2024 పూర్తి నోటిఫికేషన్‌ను చూడాలి.
విధులు ఇవీ..
జీడీఎస్ పోస్టులలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్స్ పోస్టులు ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ విధుల్లో సంబంధిత బ్రాంచ్ పోస్టల్ ఆపరేషన్స్, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), పోస్టల్ శాఖ సర్వీసుల ప్రమోషన్లు, మార్కెటింగ్, వివిధ సర్వీసులకు సంబంధించిన కస్టమర్ సర్వీసెస్ సెంటర్ల నిర్వహణ తదితరాలు ఉంటాయని నోటిఫికేషన్‌లో తెలిపారు. అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్ విధుల్లో స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల బట్వాడా, ఎక్కౌంట్ కార్యాలయాలతో తపాలా మార్పిడి తదితరాలు ఉంటాయి. దానితోపాటు ఐపీపీబీ డిపాజిట్లు/ పేమెంట్స్/ ఇతర లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైతే బీపీఎంగా కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. డాక్ సేవక్‌లు సబ్ పోస్టాఫీసులు, హెడ్ పోస్టాఫీసులు, రైల్వే తపాలా సర్వీసులు తదితరాల్లో పనిచేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ పోస్ట్‌మాస్టర్లు, / సబ్ పోస్టుమాస్టర్లకు సహకరించాల్సి ఉంటుంది. పై అధికారులు అప్పగించే విధులు నిర్వహించాల్సి ఉంటుంది
అర్హతలు ఇవే..
గణితం, ఇంగ్లిష్ తప్పనిసరిగా ఉంటూ పదో తరగతి పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బైక్ నడపడం వచ్చి ఉండటంతో పాటు కంప్యూటర్‌ను వాడటంపైనా ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపువారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ వర్తించేవారికి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
దరఖాస్తుల్లో చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడీ, మొబైల్ ఫోన్ నంబర్‌ను తప్పక ప్రస్తావించాలి. దరఖాస్తుల వెరిఫికేషన్ సమయంలో అభ్యర్థులు కావాల్సిన అన్ని పత్రాలతో హాజరుకావాలి. దరఖాస్తు రుసుము ఒకసారి చెల్లించిన తర్వాత ఎట్టిపరిస్థితిలోనూ వాపసు చేయరు.
వేతనాలు ఇలా..
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు పే స్కేలు 10వేలు మొదలుకుని 24,470 వరకూ ఉంటుంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ వేతనం స్కేలు 12వేల నుంచి 29,380 వరకూ ఉంటుంది. చౌకీదార్ పోస్టుకు ఎంపికైనవారికి నెలకు 20వేలు వేతనం ఇస్తారు.
ఇలా అప్లై చేసుకోండి..
స్టెప్ 1 :indiapostgdsonline.gov.inindiapostgdsonline.gov.in ను సందర్శించాలి.
స్టెప్ 2 : ఇండియా పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్ (జీడీఎస్) రిక్రూట్‌మెంట్ 2024 లింకుపై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
స్టెప్ 4 : కావాల్సిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5 : తగిన వివరాలతో దరఖాస్తు నింపి, సబ్మిట్ చేయాలి.
స్టెప్ 6 : తర్వాతి రోజుల్లో అవసరాల కోసం ఎకనాలెడ్జ్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి.