మూజువాణి ఓటింగ్ పద్ధతిలో విజయం
ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు
విధాత: 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి కె. సురేశ్‌పై ఆయన విజయం సాధించారు. స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది. బుధవారం లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం. ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజానాద్‌సింగ్ సహా ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రతిపాదించారు. పలువురు విపక్ష ఎంపీలు ఆ తీర్మానాన్ని బలపర్చారు.
అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టారు. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. అనంతరం ప్రధాని మోదీ, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెంట రాగా ఓం బిర్లా సభాపతి పీఠంపై ఆసీనులయ్యారు. ఆయనకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా లోక్‌సభ సభ్యులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ మీరు ఎన్నికలో గెలిచి చరిత్ర సృష్టించారని, గత కొన్ని దశాబ్దాలుగా సభాపతిగా పనిచేసిన వారంతా ఎలాంటి పోటీని ఎదుర్కోలేదని గుర్తు చేశారు. స్పీకర్ పదవి ఎంత కఠినమైందో మీకు బాగా తెలుసని, చాలా మంది లోక్‌సభ సభ్యులతో మీకున్న పరిచయలు సభ నిర్వాహణలో ఉపయోగపడుతాయన్నారు.
సభను సరైన దిశలో నడపడంలో స్పీకర్‌గా కీలక పాత్రతో లోక్‌సభ చరిత్రలోనే స్వర్ణయుగానికి మీరు నేతృత్వం వహించారన్నారు. గత ఐదేళ్లలో స్పీకర్‌గా మీ పదవీకాలంలో సభ 97 శాతం పనిచేసిందని, పాతికేళ్లలోనే ఇది అత్యధికం కావడం విశేషమని మోదీ గుర్తు చేశారు. కొవిడ్ సమయంలోనూ సభ సజావుగా సాగేలా చూశారని, సభా మర్యాదను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, అనేక కీలక బిల్లును ఆమోదించారని తెలిపారు. వచ్చే ఐదేళ్లూ సభ్యులందరికీ మార్గదర్శనం చేస్తారని విశ్వాసం ఉందని, కొత్త ఎంపీలకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారని, మీ మదురమైన చిరునవ్వుతో సభ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుందని మోదీ ప్రశంసలు కురిపించారు.
కోటా నుంచి వరుసగా రెండో సారి స్పీకర్‌గా ఎన్నిక
రాజస్థాన్ కోటా లోక్‌సభ స్థానం ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా గత 17వ లోక్‌సభకు కూడా స్పీకర్‌గా పనిచేశారు. స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా రికార్డు సాధించారు. ఆయనకంటే ముందు ఎం.ఎ. అయ్యంగార్, జి. ఎస్.థిల్లాన్, బలరాం రూబర్, జి.ఎం.సి. బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాూఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్ సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ అయ్యారు.2023లోనూ మూడోసారి ఎన్నికై మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.