ఆపరేషన్ బ్లూ స్టార్ సరైంది కాదు ఆ పొరపాటుకు ఇందిరా గాంధీ మూల్యం చెల్లించుకున్నారు : చిదంబరం

స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం సరైంది కాదని చిదంబరం ఆరోపించారు. పరేషన్ నిర్ణయానికి అంగీకరించి ఇందిరా గాంధీ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్, విధాత: పంజాబ్ రాష్ట్రం అమృత్ స‌ర్‌ పట్టణం లోని స్వర్ణ దేవాలయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ చేపట్టాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం సరైంది కాదని చిదంబరం ఆరోపించారు. స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు వేర్పాటువాదుల తరిమి కొట్టేందుకు తప్పుడు మార్గంలో ఆపరేషన్ చేపట్టారన్నారు. ఈ ఆపరేషన్ నిర్ణయానికి అంగీకరించి ఇందిరా గాంధీ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని ఆయన పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి లో కుష్వంత్ సింగ్ సాహిత్య సదస్సు జరిగింది. ఈ సదస్సులో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి పీ.చిదంబరం మాట్లాడారు. ఇది భారత సైన్యం, పంజాబ్ పోలీసులు, నిఘా వర్గాల సమిష్టి నిర్ణయమని, ఇందిర గాంధీ ది మాత్రమే కాదన్నారు. తను మిలిటరీ అధికారులను అగౌరవ పర్చడం లేదని, బ్లూ స్టార్ ఆపరేషన్ తప్పుడు నిర్ణయమన్నారు. ప్రస్తుతం పంజాబ్ లో ఖలిస్తాన్ మద్ధతుదారుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, అయినా ఆర్థిక ఇబ్బందులు ఆ రాష్ట్రానికి సమస్యగా మారాయని చిదంబరం అన్నారు.
అంతకు ముందు 2008 ముంబై దాడులపై కూడా చిదంబరం మాట్లాడుతూ, యూఎస్ నుంచి వచ్చిన ఒత్తిడుల కారణంగా పాకిస్థాన్ పై దాడులు చేయలేకపోయామని చిదంబరం అన్నారు. అప్పటి యూఎస్ సెక్రెటరీ కండోలిజా రైస్ జోక్యం చేసుకుని, పాకిస్థాన్ పై ప్రతీకార చర్యలు తీసుకోవద్దని సూచించిందన్నారు. దీనిపై పాలక బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ల మధ్య విమర్శల యుద్ధానికి దారికి తీసింది. ఈ ఘటన ముగియక ముందే మరోసారి చిదంబరం కాంగ్రెస్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని స్వర్ణ దేవాలయంలో జరిగిన బ్లూ స్టార్ ఆపరేషన్ నిర్ణయం సరైంది కాదని చెప్పడం సంచలనం రేపుతోంది.
సిక్కు వేర్పాటు వాదులు అయిన జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకుని తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారని అప్పటి ఇందిరా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. వేర్పాటు వాదులను అణచివేసేందుకు, అక్కడి నుంచి వారిని తరిమి కొట్టేందుకు 1984 జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో సైన్యం బింద్రన్ వాలే ను తుదముట్టించింది. సిక్కులు పరమపవిత్రంగా భావించే దేవాలయంలోకి భారత సైన్యం వెళ్లి వారి తిరుగుబాటును అణచివేసింది. సైన్యంతో పాటు పౌరులు కూడా ఈ ఆపరేషన్ లో ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతికారంగా అదే ఏడాది ఐదు నెలల తరువాత న్యూఢిల్లీలో అక్టోబర్ 31న ఇందిరను ఆమె నివాసంలో ఇద్దరు సిక్కు అంగ రక్షకులే దారుణంగా కాల్చి చంపిన ఘటన దేశంలోనే సంచనం కలిగించింది. ఇందిర హత్య తరువాత సిక్కు వ్యతిరేక అల్లర్లకు దారితీసింది. ఢిల్లీ నగరంలోనే 2,800 మంది సిక్కులు, దేశ వ్యాప్తంగా కలిపి 3,350 మంది సిక్కులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే.