Site icon vidhaatha

Impeachment Motion CEC Gyanesh Kumar | సీఈసీపై అభిశంసన?.. బీజేపీకి జ్ఞానేశ్‌ మరో అధికారి ప్రతినిధి: మీడియా భేటీలో ప్రతిపక్ష ఎంపీలు

Impeachment Motion CEC Gyanesh Kumar | ఓటు చోరీపై దేశవ్యాప్తంగా భారీగా ఆందోళన చేపడుతున్న ప్రతిపక్షాలు.. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఓట్ల చోరీ, బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ వివాదం నేపథ్యంలో ఆదివారం మీడియా సమావేశంలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌, సమాజ్‌వాది, డీఎంకే, తృణమూల్‌ తదితర పార్టీ ఎంపీలు మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ పనితీరును తీవ్రంగా దుయ్యబట్టిన ఎంపీలు.. తప్పుడు ఓటర్‌ లిస్టులను తయారు చేయించినందుకు గత ఎన్నికల కమిషనర్లను విచారించాలని, తక్షణ లోక్‌సభను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించిన విషయం తెలిసిందే. తన భుజాన తుపాకీ పెట్టి ఓటర్లను కాల్చుతున్నారని వాపోయారు.

పక్షపాతం చూపించే అధికారుల చేతిలో ఎన్నికల కమిషన్‌ ఉందని కాంగ్రెష్‌ ఎంపీ గౌరవ్‌ గగోయ్‌ ఆరోపించారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలో ఏ ఒక్కదానిపైనా విచారణ జరిపించేందుకు ఈసీ సిద్ధపడటం లేదని అన్నారు. ‘ఓటు హక్కు అనేది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ముఖ్యమైన హక్కు. మొత్తం ప్రజాస్వామ్యం దీనిపైనే ఆధారపడి ఉన్నది. ఎన్నికల కమిషన్‌ అనేది దానిని రక్షించాల్సి ఉంది. కానీ.. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న కీలక ప్రశ్నలకు సీఈసీ సమాధానం ఇవ్వడం లేదు. తన బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతున్నది’ అని గగోయ్‌ అన్నారు.

దాని విధుల పట్ల ఎన్నికల కమిషన్‌ నిర్లక్ష్యం వహిస్తున్నదని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. డూప్లికేట్‌ ఎపిక్‌ ఓటర్‌ కార్డుల అంశాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి లేవనెత్తినప్పటికీ.. ఎన్నికల సంఘం దానిని పరిష్కరించలేదని అన్నారు. తప్పుడు ఓటరు జాబితాల విషయంలో గత ఎన్నికల కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని, మొత్తంగా లోక్‌సభను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

హడావుడిగా ఎస్‌ఐఆర్‌ను నిర్వహించడంపై పార్లమెంటులో చర్చకు అధికార పార్టీ ఎందుకు అంగీకరించడం లేదు? అని డీఎంకే ఎంపీ తిరుచి శివ నిలదీశారు. ఈ విషయంలో తాము పదే పదే డిమాండ్‌ చేస్తుండటంతో సభను వాయిదా వేస్తున్నారని అన్నారు. జ్ఞానేశ్‌కుమార్‌ సీఈసీగా ఉండే హక్కును కోల్పోయారని సీపీఎం ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి బీ టీమ్‌గా మారిన ఎన్నిక సంఘం ప్రతిపక్షాలపై యుద్ధం ప్రకటించినట్టు కనిపిస్తున్నది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2022 యూపీ ఎన్నికల సమయంలో ఓటరు జాబితా నుంచి 18వేల ఓట్లు తొలగించిన విషయంలో తాము అనేక అఫిడవిట్లను సమర్పించినా ఎలాంటి చర్యలూ ఈసీ తీసుకోలేదని సమాజ్‌వాది పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆదివారం నాడు మేం సీఈసీని చూస్తుంటే.. బీజేపీకి కొత్త అధికార ప్రతినిధి దొరికినట్టు అనిపించింది’ అని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా సెటైర్‌ వేశారు.

ఇవి కూడా చదవండి..

Lemongrass Farming | కాసుల వ‌ర్షం కురిపిస్తున్న ‘నిమ్మ గ‌డ్డి’.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న సాఫ్ట్‌వేర్ దంప‌తులు
Brahma Kamalam | అద్భుతం ఆవిష్కృతం.. ఒకే చెట్టుకు విర‌బూసిన 24 బ్ర‌హ్మ క‌మ‌లాలు..
Dharmasthala Files | ధర్మస్థల ఖననాల కేసు : సిట్‌ మధ్యంతర నివేదిక లేనట్టే!

Exit mobile version