Drone Attacks | న్యూఢిల్లీ : సరిహద్దుల్లో పాకిస్తాన్( Pakistan ) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మళ్లీ శుక్రవారం రాత్రి పాకిస్తాన్ డ్రోన్లతో( Pak Drones ) దాడులకు దిగింది. ఉత్తరాన బారాముల్లా నుంచి దక్షిణాన భుజ్ వరకు ఎల్‌వోసీ( LoC ) వెంబడి 26 ప్రాంతాల్లో డ్రోన్లతో పాక్ దాడి చేసింది. ముఖ్యంగా భారత పౌరులు, సైనికులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సాయుధ డ్రోన్లను ప్రయోగించింది. పాక్ అటాకింగ్‌ను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. వారి డ్రోన్లను కూడా భారత బలగాలు కూల్చేశాయి.
శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి పాక్‌కు బుద్ధి చెప్పింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను భారత సైన్యం పేల్చేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్ అవుట్ పాటించారు. పఠాన్ కోట్, ఉధంపుర్, నగ్రోటా, జైసల్మేర్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పంపిన 50 డ్రోన్లను భారత సైనికులు కూల్చేశారు.
పాక్ డ్రోన్ దాడులు జరిపిన ప్రదేశాలు ఇవే!
బారాముల్లా, శ్రీనగర్, అవంతిపొర, జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్, అమృత్‌సర్, ఫిరోజ్‌పుర్, హోషియార్‌పుర్, గురుదాస్‌పుర్ తదితర ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడిందని భారత సైన్యం పేర్కొంది.
పాక్ ప్రయోగించిన ఓ డ్రోన్ వల్ల ఫిరోజ్‌పూర్‌లోని ఓ కుటుంబం గాయపడింది. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందించారు. భారత భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ద్వారా ఎప్పటికప్పుడు పాక్ చేస్తున్న డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయి. భయపడాల్సిన అవసరమేమీ లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఆర్మీ సూచించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసింది.