LoC Ceasefire | న్యూఢిల్లీ : పాకిస్తాన్( Pakistan ) మళ్లీ దుశ్చర్యకు పాల్పడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని( LoC Ceasefire ) పదేపదే ఉల్లంఘిస్తుంది. వరుసగా రెండో రోజు నియంత్రణ రేఖ( LoC ) వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ సైన్యం( Pakistan Army ) కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. కాల్పుల మోత మోగిస్తుంది. పాక్ కాల్పులను భారత సైన్యం( Indian Army ) సమర్థవంతంగా తిప్పికొడుతోంది. గురువారం రాత్రి పాక్ రేంజర్లు భారత సైన్యం పోస్టులపై కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి కూడా పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది.
ఈ కాల్పులను భారత ఆర్మీ అధికారులు ధృవీకరించారు. పాక్ జరిపిన కాల్పుల్లో భారత సైన్యానికి ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. పాక్ సైన్యం చర్యలను భారత ఆర్మీ నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు తూటాల వర్షం కురిపించి 26 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇండియా – పాకిస్తాన్ మధ్య తీవ్ర అలజడి కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్‌ను విడిచి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ఈ చర్యలతో పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతూ.. భారత ఆర్మీ పోస్టులను లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి వేళ కాల్పులకు తెగబడుతోంది పాక్ ఆర్మీ.