దేశంలోనే భారీ పొడవైన సముద్ర వంతెనను 12న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, సవాల్‌తో కూడిన ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌

  • Publish Date - January 7, 2024 / 05:16 AM IST

MTHL | స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ నెల 12న దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, సవాల్‌తో కూడిన ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ (MTHL) ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దేశంలోనే ఇది అతి పొడవైన సముద్ర వంతెన ఇదే. ఆరులేన్ల వంతెన పొడువు 21.8 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 16.5 కిలోమీటర్ల సముద్రంలో నిర్మించగా.. మిగతా 5.5 కిలోమీటర్ల నేలపై నిర్ణయించారు. ఎంటీహెచ్‌ఎల్‌కి మాజీ ప్రధాని దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరును పెట్టారు.


మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే వంతెన పనులను పరిశీలించి.. ప్రారంభోత్సవ తేదీని ప్రకటించనున్నారు. వంతెనను ఎంఎంఆర్‌డీఏ నిర్మించింది. ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ ముంబయి శివారులోని శివాడీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవాషెవా సమీపంలోని చిర్లే శివారులో వరకు ఉంటుంది. రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని వంతన గణనీయంగా తగ్గిస్తుందని మహారాష్ట్ర సీఎం అన్నారు. దీంతో ఆర్థిక రాజధాని రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గంటకు వంద కిలోమీటర్ల వేగంతో..

దేశంలోనే అతిపొడవైన ఈ సముద్ర వంతెన థానే క్రీక్ మీదుగా విస్తరించి ఉంటుంది. ఎంఎంఆర్‌డీఏ హైవేపై గంటకు వంద కిలోమీటర్ల వేగ పరిమితి నిర్ణయించింది. ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ టెక్నాలజీతో వంతెనను నిర్మించారు. కాంక్రీట్, కాంపోజిట్ గిర్డర్‌లతో పోలిస్తే తక్కువ బరువు కలిగి ఉంటుందని.. బలమైన నిర్మాణంతో పోలిస్తే.. భారతదేశంలో మొదటిదిగా నిలువనున్నది. నిర్మాణ అంచనా వ్యయం మొత్తం రూ.17,843 కోట్లు కాగా.. ప్రాజెక్ట్‌ను ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) నిర్మాణం చేపట్టింది. వంతెన నిర్మాణానికి 165,000 టన్నుల రీన్‌ఫోర్స్‌మెంట్ స్టీల్, 96,250 టన్నుల స్ట్రక్చరల్ స్టీల్, 830,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను అవసరమైనట్లు ఇంజినీరింగ్‌ నిపుణులు అంచనా వేశారు.