కాంగ్రెస్‌కు, జేఎంఎం లకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదు
పరిశ్రమలు, వ్యాపారవేత్తలను వ్యతిరేకిస్తున్న రాహుల్
జార్ఖండ్ బహిరంగ సభలో ప్రధాని విమర్శలు
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వాడే భాష మావోయిస్టులు వాడే భాషలా ఉండటం వల్ల ఆపార్టీ వారి మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే వారు, పారిశ్రామికవేత్తలు 50 సార్లు ఆలోచిస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్‌కు, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లకు అభివృద్ధి గురించి ఏమీ తెలియదని ప్రతిచోటా అబద్ధాలు మాట్లాడటమే తెలుసునని విమర్శించారు. ప్రజల సంపదను ఎక్సరే తీసి దోచుకోవడమే వారి లక్ష్యమని మోడీ ఆరోపించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్‌లోని ఝంషడ్ పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాల ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో.. నేను ఆ రాష్ట్రాల సీఎంలకు నేను సవాల్ చేస్తున్నాను. ఇది నా రాజకీయ ప్రకటన కాదు, ఇది నా ఎన్నికల ప్రకటన కాదు. వారి యువరాజు రాహుల్ పరిశ్రమలు, వ్యాపారవేత్తలను, పెట్టుబడులను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇలా చేస్తే .. ఏ వ్యాపారవేత్త వెళ్లి కాంగ్రెస్, ఆపార్టీ మిత్రపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతాడు? ఆ రాష్ట్రాల యువకుల భవిష్యత్తు ఏమౌతుంది? అని ప్రశ్నించారు.
నా వద్దకు వచ్చే పెట్టుబడిదారులంతా మేము ఆ రాష్ట్రాలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఎందుకంటే తమకు వ్యతిరేకంగా ఉన్న భావజాలంతో ఆ ప్రభుత్వాలు ఉన్నాయని, తమను దూషిస్తారని చెప్పారు. వారి యువరాజే అలాంటి ఆలోచనతో ఉంటే మిత్రపక్షాలు కూడా అదే తరహా ఆలోచనలతో ఉంటాయని పెట్టుబడిదారులు అనుకుంటారు.
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు లాక్కోవాలని ఇండియా కూటమి భావిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతున్నదని విమర్శించారు. లోక్‌సభ స్థానాలను తమ పూర్వీకుల ఆస్తిగా పరిగణిస్తున్నదని వ్యాఖ్యానించారు. తన తల్లి స్థానమైన రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ఈ విమర్శలు చేశారు. పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను రాహుల్ ఎందుకు విమర్శిస్తున్నారో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు చెప్పాలని ప్రధాని ప్రశ్నించారు.