బెంగళూరు: అనేక మంది మహిళలను లైంగికంగా వేధించాడన్న కేసులో హసన్ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఆయనకు లైంగిక సామర్థ్య పరీక్షను నిర్వహించనున్నది. శుక్రవారం తెల్లవారుజామున బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రేవణ్ణను సిట్ అధికారులు అక్కడే అరెస్టు చేశారు. ఆయనను ప్రజాప్రతినిధుల కోర్టులో హాజరుపర్చి, కస్టడీ కోరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనపై నేరాన్ని రుజువు చేసేందుకు ప్రజ్వల్‌కు లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మహిళలపై లైంగికదాడులకు పాల్పడిన కేసులలో నేరాన్ని రుజువు చేసే ముందు అసలు సదరు నిందితుడికి శారీరకంగా ఆ శక్తి ఉన్నదా? అనేది తెలుసుకుంటారు. ఇది దర్యాప్తులో భాగం. అందుకోసం సదరు వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు నేపథ్యంలో బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయనకు బీపీ, బ్లడ్ సుగర్ లెవల్స్, హృదయ సంబంధ ఆరోగ్యం సహా పలు వైద్య పరీక్షలకు ఇక్కడికే తీసుకురానున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ శుక్రవారం తెల్లవారుజామున 12.40, 12.50 గంటల మధ్య జర్మనీ నుంచి కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నట్టు రాష్ట్ర హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. ఆయనపై అరెస్టు వారెంటు ఉండటంతో సిట్ అధికారులు అక్కడే అతడిని అరెస్టు చేసినట్టు చెప్పారు. పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రజ్వల్ కేసులో బాధితులు ముందుకు వచ్చి, తమకు జరిగిన అన్యాయాల గురించి మాట్లాడాలని పరమేశ్వర విజ్ఞప్తి చేశారు.