విధాత, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింతగా పటిష్టం చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రియాంకా వాద్రాను రంగంలోకి దింపాలని అనుకుంటుందా అంటే అవుననే విధంగా అడుగులు పడుతున్నాయి. కర్నాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలో రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రియాంకా వాద్రా పోటీ చేసే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. కర్నాటకలోని కొప్పాల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సీక్రెట్ గా సర్వే నిర్వహించారు. ఈ నియోజకవర్గం పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో సిద్దనూర్, మస్కి, కనకగిరి, ఎల్బుర్గ, కొప్పాల్, సిరుగుప్ప నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా కుష్టగి నుంచి బిజెపి గెలుపొందింది. గంగావతి నుంచి మాజీ బిజెపి నాయకుడు, ప్రాంతీయ పార్టీ అధినేత గాలి జనార్థన్ రెడ్డి విజయం సాధించారు.
అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడంతో ప్రియాంకా బరిలో ఉంటే గెలుపు సునాయసం అవుతుందనే వాదన ఉంది. లోపాయకారిగా గాలి జనార్థన్ రెడ్డి కూడా ప్రియాంకకు మద్ధతు పలికే అవకాశాలను తోసిపుచ్చలేము. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున విజయానికి అడ్డంకులు ఉండవనే ధీమా పెరిగింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని పోటీ చేయాలని పిసిసి తీర్మానం చేసింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినందున రాష్ట్రంలో పోటీ చేస్తే గెలిపించి రుణం తీసుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఖమ్మం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. కాని పక్షంలో గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిపించుకుంటామని అంటున్నారు. తెలంగాణలో సోనియా పోటీ చేస్తారా లేదా ప్రియాంకను పోటీలోకి దింపుతారా అనేది మున్ముందు స్పష్టమవుతుంది.