న్యూఢిల్లీ: ఢిల్లీలోని కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించిన ఘటనపై విచారణ కమిటీని కేంద్ర హోం శాఖ సోమవారం నియమించింది. ఘటనకు కారణాలు, బాధ్యులను నిర్ణయించడంతోపాటు పాలసీపరమైన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సలహాలు ఇస్తుందని హోం శాఖ ప్రతినిధి ఒకరు ఎక్స్‌లో తెలిపారు. ఈ కమిటీలో అర్బన్, హౌసింగ్ శాఖ అదనపు కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సీపీ, ఫైర్ సలహాదారు, హోం శాఖ సంయుక్త కార్యదర్శి (కన్వీనర్) సభ్యులుగా ఉంటారు. 30 రోజులలోగా కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని హోం శాఖ ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉంటే.. అంతకు ముందు రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా జవాబుదారీతనాన్ని నిర్ణయించాలని చెప్పారు. ఈ విషయంలో రాజకీయాలు వద్దని అన్నారు. ‘నిర్లక్ష్యం జరిగింది. దీనికి బాధ్యులెవరో తేల్చాలి. తద్వారా ఒక పరిష్కారాన్ని కనుగొనాలి’ అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. కోర్టు వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.