Site icon vidhaatha

Muda Scam | ముడా స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌?

గవర్నర్‌ తీసుకోబోయే నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతల్లో ఉత్కంఠ

బెంగళూరు : మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (Mysuru Urban Development Authority) (ఎంయూడీఏ) ప్లాట్ల కేటాయింపు విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌ అంశం ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల్లో కలకలం రేపుతున్నది. ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ తావర్‌ చాంద్‌ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) అనుమతిస్తారా? అనే సస్పెన్స్‌ కొనసాగుతున్నది. గత గవర్నర్‌ హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ దారినే గవర్నర్ గెహ్లాట్‌ కూడా అనుసరిస్తారన్న ఆందోళన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతున్నది. 2011లో అక్రమ మైనింగ్‌ కేసులో లోకాయుక్త నివేదికను అనుసరించి నాటి ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప (B.S. Yediyurappa) ప్రాసిక్యూషన్‌కు నాటి గవర్నర్‌ భరద్వాజ్‌ అనుమతించారు. ఇనుప ఖనిజం అక్రమ మైనింగ్‌, అక్రమంగా భూముల డీనోటిఫికేషన్‌ (illegal land denotification), బంధుప్రీతి తదితర ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం 1988 (Prevention of Corruption Act 1988) కింద ఆయన ఈ మేరకు అనుమతులు జారీ చేశారు.

ఈ రోజు కూడా అవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని, కాకపోతే రంగంలో ఉన్నవారు మాత్రం మారిపోయారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఇద్దరు న్యాయవాదులు సిరాజిన్‌ బాషా, కేఎన్ బాలరాజ్‌.. తీవ్ర అవినీతి ఆరోపణలు (grave allegations of corruption) ఎదుర్కొంటున్న యడ్యూరప్పను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతిని కోరారు. ఇప్పుడు సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఆర్టీఐ కార్యకర్త (RTI activist) ఒకరు పిటిషన్‌ దాఖలు చేశారు. జూలై 26, 2024న ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహం ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేయడానికి అనుమతి కోరడంపై స్పందించిన గవర్నర్‌.. ఈ విషయంలో సిద్ధరామయ్యకు షోకాజ్‌ నోటీసును జారీ చేశారు.

ముడా సైట్‌ల కేటాయింపులో ముఖ్యమంత్రి కుటుంబం జోక్యం చేసుకుందనేది అబ్రహం అరోపణ. అప్పట్లో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న యడ్యూరప్పను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ భరద్వాజ్‌ అనుమతి ఇవ్వడం, ఆయన జైలుకు వెళ్లడం బీజేపీని తీవ్ర ఇరకాటంలో పడేసింది. రెండు ఉదంతాల్లోనూ దర్యాప్తు సంస్థల పాత్ర లేకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి లేకుండా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అధ్యక్షతన ఆగస్ట్‌ 1న జరిగిన మంత్రివర్గ సమావేశం.. ముఖ్యమంత్రికి జారీ చేసిన షోకాజ్‌ నోటీసును ఉపసంహరించుకోవాలని, ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని గవర్నర్‌కు సలహా ఇస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ‘ప్రభుత్వం ఈ కేసులో దర్యాప్తు చేసేందుకు ఇప్పటికే రిటైర్డ్‌ జస్టిస్‌ పీఎన్‌ దేశాయ్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఇది ఒక ముఖ్యమంత్రికి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కనుక కనీసం ఏకసభ్య కమిషన్‌ నివేదిక వచ్చేంత వరకైనా గవర్నర్‌ వేచి ఉండాలి’ అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ (deputy chief minister D.K. Shivakumar) అన్నారు.

బెంగళూరు నుంచి మైసూరుకు పాదయాత్ర

ఈ విషయంలో అధికారపక్షాన్ని ఇరకాటంలో పడేసేందుకు ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ ప్రయత్నాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి రాజీనామాను, ముడా స్కాంలో సీబీఐ విచారణను డిమాండ్‌ చేస్తూ బెంగళూరు నుంచి మైసూరు వరకు ఏడు రోజుల పాదయాత్ర (7-day padayatra from Bengaluru to Mysuru) కార్యక్రమాన్ని చేపట్టాయి. ముఖ్యమంత్రి తప్పుడు మాటలు చెబుతున్నారని పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్‌ అశోక్‌ ఆరోపించారు. దేవనూరు లేఅవుట్‌లో (Devanur layout) ముఖ్యమంత్రి భార్యకు ఆమె సోదరుడు మూడు ఎకరాల 16 గుంటల భూమిని గిఫ్ట్‌గా ఇవ్వడం అక్రమమని అశోక్‌ అన్నారు. వాస్తవానికి ఆ భూమి దళితులకు చెందినదని, వారి వారసులకు తెలియకుండా ఈ భూమి క్రయవిక్రయాలు జరిగాయని ఆరోపించారు. అప్పటికే కొనుగోలు చేసి, డెవలప్‌ చేసి, లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమిని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ముడా డీనోటిఫై చేసిందని విమర్శించారు.

ముఖ్యమంత్రి సన్నిహితులకు 500కుపై సైట్లను ముడా కేటాయించిందని ఆయన ఆరోపించారు. అయితే.. సైట్ల కేటాయింపు వ్యవహారం అంతా పారదర్శకంగా, నిబంధనల మేరకే జరిగిందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బీజేపీ చేతిలో గవర్నర్‌ తోలు బొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ తొలి నోటీసుకు జవాబు ఇచ్చేందుకు నిరాకరించిన సిద్ధరామయ్య.. రెండో నోటీసుకు సమాధానం ఇస్తూ అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్ అనుమతించిన పక్షంలో అధికార కాంగ్రెస్‌కు తీవ్ర ఎదురుదెబ్బగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రికి పూర్తి మద్దతు పలకాలని అధిష్ఠానం నుంచి ఇటీవల బెంగళూరుకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు స్పష్టం చేశారు. ఈ కేసులో అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలని పార్టీ అధిష్ఠానం ఆలోచిస్తున్నదని సమాచారం.

Exit mobile version