విధాత : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తా ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్) తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది. ఆర్జీకార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది. జూనియర్ వైద్యురాలి దారుణ హత్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోర్డా నిన్న కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఇందుకు 24 గంటల డెడ్‌లైన్ ఇచ్చింది. లేకపోతే ఆస్పత్రుల్లో సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది. దీనికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడవద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.
నిందితుడి అరెస్టు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కత్తాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడి చోటుచేసుకున్నట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఆమె మర్మాంగాలు, నోరు, కండ్ల నుంచి రక్తస్రావం జరిగినట్లు శవపరీక్షలో తేలింది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కనిపించాయి. ఆమెపై హత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక తేల్చింది. మరోవైపు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రాయ్ అనే వాలంటీర్‌ను అరెస్టు చేశారు. అతను విపత్తుల నిర్వాహణలో పోలీస్ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు, అశ్లీల చిత్రాలు వీడియోలకు బానిసై హత్యాచర ఘటనకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యా స్థలంలో దొరికన బ్లూటూత్ ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకొని హంతకుడిగా నిర్ధారించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఆస్పత్రిలో ఉద్యోగుల రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోంది.