అమేథీలో మళ్లీ రాహుల్ పోటీ?

రెండో దశలో వాయనాడ్‌ పోలింగ్‌ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అమేథీవైపు మళ్లింది. వాస్తవానికి చాలా రోజుల నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేస్తారా? చేయరా? అన్న చర్చ జరుగుతూనే ఉన్నది.

  • Publish Date - April 26, 2024 / 09:23 PM IST

  • నేడు అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్‌ నిర్ణయం
  • అమేథీలో రాహుల్‌ నివాసానికి మరమ్మతులు

అమేథీ: రెండో దశలో వాయనాడ్‌ పోలింగ్‌ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అమేథీవైపు మళ్లింది. వాస్తవానికి చాలా రోజుల నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేస్తారా? చేయరా? అన్న చర్చ జరుగుతూనే ఉన్నది. శనివారం జరిగే కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో అమేథీతోపాటు రాయ్‌బరేలీ అభ్యర్థి ఎంపిక కూడా ఉంటుందని తెలుస్తోంది. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ కోట రాయ్‌బరేలీ నుంచి ఆమె కుమార్తె, రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ వాధ్రా పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగానే సాగుతున్నది. ఈ చర్చ సంగతి పక్కనపెడితే.. ఎన్నికల సంఘం తెలిసి చేసిందో.. తెలియక చేసిందో కానీ.. రాహుల్ గాంధీకి భారీ ప్రయోజనం కల్పించినట్టు కనిపిస్తున్నది. కేరళలోని వాయనాడ్‌ పోలింగ్‌ శుక్రవారం ముగియగా.. అమేథీలో పోలింగ్‌ మాత్రం దాదాపు నెల రోజులకు అంటే.. మే 20వ తేదీన నిర్వహించనున్నారు. దీంతో ఒకప్పటి తమ కంచుకోట అమేథీపై రాహుల్‌ ప్రత్యేక దృష్టిసారించేందుకు అవకాశం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోపే అమేథీలోని రాహుల్ గాంధీ నివాసాన్ని శుభ్రం చేయించడం, గార్డెన్‌ను సరిచేయడం వంటి అంశాలు రాహుల్ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి. టెంట్‌ సామగ్రి సైతం గార్డెన్‌లో ఒక మూల ఉంచడం గమనార్హం.
అయితే.. ఊహాగానాలను కొట్టిపారేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు.. ఇక్కడ ఆయన నిలబడినా నిలబడక పోయినా అమేథీలో రాహుల్‌ ప్రచారం చేయడం ఖాయమని అంటున్నారు. అయితే.. రాహుల్ ఇక్కడ పోటీ చేయకపోతే మరి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరు ఉంటారన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. నెహ్రూ, ఇందిర, సోనియా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలో పోటీ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న ప్రియాంక అమేథీ నుంచి పోటీ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాధ్రా చాలా కాలం నుంచి రాజకీయ ఆకాంక్షలతో ఉన్నారు. గాంధీ కుటుంబం నుంచే అభ్యర్థి ఉండాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారంటూ.. తాను సైతం రేసులో ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఆ అంశంపై పెద్దగా మాట్లాడనప్పటికీ అమేథీలోని గౌరీగంజ్‌ ప్రాంతంలోని పార్టీ ఆఫీస్‌ వద్ద కొద్ది రోజుల క్రితం ఆయన ఫొటోతో పోస్టర్లు వెలియడం ఇప్పటికీ ఆ సీటును రాబర్ట్‌ కోరుకుంటున్నారనే ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
యూపీలో అఖిలేశ్‌ యాదవ్‌ తాను, తన భార్య డింపుల్‌ ప్రాతినిధ్యం వహించిన కన్నౌజ్‌ స్థానంలో తన బావమరిదిని నిలుపుతారని అంతా అనుకున్న.. ఆయనను పక్కకు పెట్టి.. తానే నామినేషన్‌ వేశారు. రాహుల్‌ కూడా ఇలానే ఆఖరి నిమిషంలో పోటీకి దిగుతారా? అన్న సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అమేథీలో రాహుల్‌ పోటీ చేస్తే.. బీజేపీ సిటింగ్‌ ఎంపీ స్మృతి ఇరానీతో ఆయన మూడోసారి తలపడినట్టు అవుతుంది. 2014 ఎన్నికల్లో లక్ష ఓట్ల పైచిలుకు మెజార్టీతో స్మృతి ఇరానీని రాహుల్ ఓడిస్తే.. 2019 ఎన్నికల్లో రాహుల్‌ను స్మృతి ఇరానీ 55,120 ఓట్ల తేడాతో ఓడించారు. అమేథీలో 9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ మధ్యే అమేథీలో నూతన గృహ ప్రవేశం చేసిన ఇరానీ.. తన నియోజకవర్గంతో తన అనుబంధానికి ఇది నిదర్శనమని చెప్పుకొన్నారు. అయితే.. తలబిరుసుతో ఉంటారని, కార్యకర్తల్లో పెద్దగా ఆదరణ లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇటీవలి కాలంలోనే ఇక్కడ బీజేపీ పుంజుకున్నది. 2009 ఎన్నికల్లో తన సమీప బీఎస్పీ అభ్యర్థిపై రాహుల్‌ గాంధీ 3,70,000 వేల భారీ మెజార్టీ సాధించారు. అప్పట్లో బీజేపీ మూడో స్థానంలో నిలిచింది.

రాహుల్‌ బాబాయి సంజయ్‌ గాంధీ అమేథీలో తొలుత పోటీ చేశారు. ఆయన మరణానంతరం రాజీవ్‌గాంధీ ఆ సీటును అందుకున్నారు. రాజీవ్‌గాంధీ 1991లో హత్యకు గురైన తర్వాత గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉన్న సతీశ్‌శర్మ ఇక్కడ 1998 వరకు ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ఒక్కసారి బీజేపీ గెలిచింది. 1999లో సోనియా గాంధీ విజయం సాధించగా.. 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్ విజయం సాధించారు. 2019లో ఓడిపోయారు. ఇప్పుడు ఇరానీ, రాహుల్‌ మధ్య మళ్లీ పోటీ జరిగితే పాత వైభవాన్ని తిరిగి తెచ్చుకుని రాహుల్ విజయం సాధిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. అయితే.. రాహుల్‌కు విజయావకాశాలు 80 శాతం ఉన్నాయని తమ ఆంతరంగిక సర్వేల్లో వెల్లడైందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా శనివారంతో అమేథీ సస్పెన్స్‌ తొలగిపోతుంది.

Latest News