Kishori Lal Sharma | అమేథిలో స్మృతి ఇరానీని చిత్తుగా ఓడించిన కిశోరీ లాల్ శ‌ర్మ‌.. ఎవ‌రాయ‌న‌..?

Kishori Lal Sharma | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్ అభ్య‌ర్థి కిశోరీ లాల్ శ‌ర్మ చిత్తుగా ఓడించారు. ల‌క్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఇరానీపై కిశోరీ లాల్ శ‌ర్మ భారీ విజ‌యం సాధించారు. స్మృతి ఇరానీపై భారీ మెజార్టీతో గెలుపొందిన శ‌ర్మ‌కు కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

  • Publish Date - June 4, 2024 / 04:16 PM IST

Kishori Lal Sharma | ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమేథి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్ అభ్య‌ర్థి కిశోరీ లాల్ శ‌ర్మ చిత్తుగా ఓడించారు. ల‌క్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఇరానీపై కిశోరీ లాల్ శ‌ర్మ భారీ విజ‌యం సాధించారు. స్మృతి ఇరానీపై భారీ మెజార్టీతో గెలుపొందిన శ‌ర్మ‌కు కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీతో పాటు ప‌లువురు నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట‌గా ఉన్న అమేథిలో 2014, 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ పాగా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు ఎన్నిక‌ల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ప‌రాజ‌యం చెందారు. 2014 ఎన్నిక‌ల్లో ల‌క్ష ఓట్ల తేడాతో, 2019 ఎన్నిక‌ల్లో 55 వేల ఓట్ల తేడాతో రాహుల్ ఓడిపోయారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయ‌లేదు. గాంధీ ఫ్యామిలీకి న‌మ్మ‌క‌స్తుడైన కిశోరీ లాల్ శ‌ర్మ‌ను ఈఎన్నిక‌ల్లో స్మృతి ఇరానీపై బ‌రిలో దింపారు. మొత్తానికి ఇరానీని లాల్ శ‌ర్మ ఓడించి, అమేథీలో కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోశారు.

ఎవ‌రీ కిశోరీ లాల్ శ‌ర్మ‌..?

పంజాబ్‌లోని లుధియానాకు చెందిన కిశోరీ లాల్ శ‌ర్మ‌.. గాంధీ కుటుంబానికి వెన్నంటి ఉన్నారు. 1980 నుంచి రాయ్‌బ‌రేలీ, అమేథీ నియోజ‌క‌వ‌ర్గాల్లో శ‌ర్మ‌.. గాంధీ కుటుంబం కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారు. సంజ‌య్ గాంధీ చ‌నిపోయిన త‌ర్వాత జ‌రిగిన అమేథి ఉప ఎన్నిక‌ల్లో రాజీవ్ గాంధీ భారీ విజ‌యం సాధించారు. నాటి ఎన్నిక‌ల నుంచి అమేథిలో శ‌ర్మ కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేశారు. అదే స్థాయిలో రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా త‌న సేవ‌లందించారు. 40 ఏండ్ల పాటు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ శ‌ర్మ‌కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చారు. ఈ ఎన్నిక‌ల్లో అమేథి నుంచి శ‌ర్మ పోటీ చేస్తార‌ని, ఆయ‌న‌ను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను ప్రియాంక గాంధీ కోరారు. శ‌ర్మ‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో మంచి సంబంధాలు ఉండ‌డం, స్థానిక స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండ‌డంతో ఆయ‌న గెలుపున‌కు మార్గం సుగ‌మ‌మైంది.

Latest News