Site icon vidhaatha

Rahul Gandhi | రాజ్యాంగ బాధ్యతలు విస్మరిస్తే చర్యలే: రాహుల్ గాంధీ

విధాత: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసి బీజేపీ ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని దోచుకోవాలని చూస్తున్నదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన పోలింగ్‌లో ఓ యువకుడు ఎనిమిదిసార్లు బీజేపీకి ఓటు వేశాడని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశాడు.

ఆ పోస్టుకు రాహుల్‌ ఎక్స్‌లోనే బదులిచ్చాడు. రాజ్యాంగ ప్రమాణాలను అవమానించే చర్యలకు పాల్పడితే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులంతా ఒత్తిడికి తలొగ్గి తమ రాజ్యాంగబాధ్యతను మరిచిపోకూడదని రాహుల్‌ పేర్కొన్నారు.

రాహుల్‌, అఖిలేశ్‌ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్టులకు యూపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ నవదీప్‌ స్పందించారు. ఏటా నయాగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, ఒకరిని అరెస్ట్‌ చేశారని ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఘటన జరిగిన పోలింగ్‌ కేంద్రంలో రీ పోలింగ్‌ కోసం ఈసీకి సిఫార్సు చేసినట్టు చెప్పారు.

Exit mobile version