Rahul Gandhi | సిద్ధూ మూసేవాలా పాటలా తమకు సీట్లు వస్తాయన్న రాహుల్‌.. ఏమిటా పాట? ఎన్ని సీట్లు?

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శనివారం (01.06.2024) తుదివిడత పోలింగ్‌ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం కల్పితాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కొట్టిపారేశారు

  • Publish Date - June 2, 2024 / 05:11 PM IST

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శనివారం (01.06.2024) తుదివిడత పోలింగ్‌ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ కేవలం కల్పితాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కొట్టిపారేశారు. కొంతకాలం క్రితం హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా పాటలా ఇండియా కూటమికి 295 సీట్లకు పైగా వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ రోజు సన్నద్థతపై నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కేంద్ర కార్యాలయానికి వచ్చిన రాహుల్‌.. ఎగ్జిట్‌ పోల్స్‌ను మోదీ మీడియా పోల్స్‌గా అభివర్ణించారు.

‘అది ఎగ్జిట్‌ పోల్‌ కాదు.. అది మోదీ మీడియా పోల్‌. అది ఆయన కల్పిత పోల్‌’ అని అన్నారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు.. ‘మీరు సిద్ధూ మూసేవాలా 295 పాట విన్నారా? 295’ అని బదులిచ్చారు. 295 అనే పాట సిద్ధూమూసేవాల పాడారు. నేను నిజం మాట్లాడితే నాపై సెక్షన్‌ 295 పెడతారు.. అనే చరణాల్లో ఈ 295 ప్రస్తావన ఉన్నది. దీన్ని ప్రస్తావించిన రాహుల్‌.. పై విధంగా సమాధానం చెప్పారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 593,287,707 వ్యూస్‌ ఉన్నాయి.

295కు తగ్గవు: జైరాం రమేశ్‌

ఎగ్జిట్‌పోల్స్‌ నకిలీ అని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ కొట్టిపారేశారు. ‘ఇండియా కూటమికి 295కు తగ్గకుండా స్థానాలు లభిస్తాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌ నకిలీవి. ఎందుకంటే.. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ఎన్నికల సంఘం, కౌంటింగ్‌ ఏజెంట్లు, రిటర్నింగ్‌ అధికారులపై ఒత్తిడి పెంచాలని వారు ప్రయత్నిస్తున్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తున్నామనే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది’ అని ఆయన పేర్కొన్నారు. పదవి నుంచి దిగిపోతున్న హో మంత్రి 150 జిల్లాల మెజిస్ట్రేట్లకు, కలెక్టర్లకు శనివారం ఫోన్‌ చేశారని ఆరోపించారు. వాస్తవ సంఖ్యలతో ఎగ్జిట్‌పోల్స్‌కు ఎలాంటి సంబంధం లేదని జైరాంరమేశ్‌ స్పష్టంచేశారు.

Latest News