న్యూఢిల్లీ: భద్రతా వైఫల్యాన్ని ప్రశ్నించిన 146 మంది ప్రతిపక్ష సభ్యులను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేయడంపై దేశవ్యాప్తంగా శుక్రవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంటూ న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వామపక్షాలు, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, టీఎంసీ, జేఎంఎం, ఆర్జేడీ తదితర భాగస్వామ్య పక్షాల నాయకులు ఈ ధర్నా కార్యక్రమానికి హాజరయ్యారు.
భద్రతావైఫల్యంపై ప్రశ్నించినందుకు, దానిపై ప్రధాని, హోం మంత్రి ప్రకటనకు పట్టుబట్టినందుకు విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం డిసెంబర్ 15న ప్రారంభమైంది. ఇప్పటి వరకూ మొత్తం 145 మందిని ఉభయ సభల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీని ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ ఎంత విద్వేషం వెదజల్లితే అంతకు మించిన ప్రేమను, సోదరభావాన్ని ఇండియా కూటమి పార్టీలు పంచుతాయని అన్నారు. 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా దేశంలోని 60 శాతం ప్రజల గొంతులను ప్రభుత్వం నొక్కేసిందని విమర్శించారు.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం జరిగి, దుండగులు పొగను వెదజల్లినప్పుడు బీజేపీ ఎంపీలు లోక్‌సభ నుంచి వెంటనే పరారయ్యారని రాహుల్ ఎద్దేవాచేశారు. ‘అసలు ఆ ఇద్దరు యువకులు ఎలా లోనికి రాగలిగారు? వారు గ్యాస్ క్యాన్లు పట్టుకుని వచ్చారు. వాటిని వారు లోనికి తీసుకుని రాగలిగారంటే.. ఏవైనా తీసుకువచ్చేవాళ్లు’ అని అన్నారు. లోక్‌సభలోకి యువకులు చొరబడిన ఘటనకు కారణాలను కూడా గమనించాల్సి ఉన్నదని చెప్పారు. ‘ఈ ఘటనలో భద్రతా వైఫల్యం అనే అంశం ఉన్నది. దానితోపాటు వారు ఎందుకు ఈ మార్గంలో నిరసన వ్యక్తం చేశారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నది. ఆ ప్రశ్నకు సమాధానం దేశంలో నిరుద్యోగం’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం పార్లమెంటులో జరిగిన నిరసనలు, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌కర్‌ను తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరించడం వంటి ఘటనల గురించి రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశంలో నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదు. కానీ.. పార్లమెంటు వెలుపల ధర్నాలో రాహుల్‌గాంధీ వీడియో రికార్డు చేయడం గురించి మాత్రం మాట్లాడుతుంది’ అని విమర్శించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేంద్ర ప్రభుత్వ లోపాల వల్లే జరిగిందని స్పష్టం చేశారు.
ఎంత అణచివేస్తే అంతకు మించి ఎదుగుతాం
బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, అందుకే ప్రతిపక్ష పార్టీలు ఐక్యమయ్యాయని మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘అంతా ఏకమైతే మోదీ ఏమీ చేయలేరు. మీరు (మోదీ) మమ్మల్ని ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే మేము మరింత ఎత్తుకు ఎదుగుతాం. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మేం అంతా ఐక్యంగా పోరాడుతున్నాం’ అని చెప్పారు. రాజ్యసభ చైర్మన్‌ను కల్యాణ్ బెనర్జీ అనుకరించిన ఘటనపై ధన్‌కర్ కుల ప్రస్తావన చేయడాన్ని ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ‘రాజ్యాంగ ప్రకారం ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నది. మేం పార్లమెంటులో నోటీసు ఇచ్చినప్పుడు మాకు కనీసం ఆ నోటీసును చదివి వినిపించే అవకాశం కూడా ఇవ్వరు.
మీరు (ధన్‌కర్) రాజ్యాంగ పదవిలో ఉండీ విలపిస్తున్నారు. మీరు కులం గురించి మాట్లాడుతున్నారు. దళితులను బీజేపీ ప్రభుత్వం మాట్లాడనీయడం లేదని నేను చెప్పనా? మీరు మా భావ ప్రకటనా హక్కును గుంజుకోలేరు’ అని ఖర్గే స్పష్టం చేశారు. ‘400 సీట్లు గెలుస్తామని మోదీ లోక్‌సభ ఎన్నికలకు ముందే చెబుతున్నారన్న ఖర్గే.. ఆయనకు అంత ప్రజాదరణ ఉన్నదా? అని ప్రశ్నించారు. 400 సీట్లు గెలవడానికి మీకు ఏమున్నది? కర్ణాటకలో ఏం జరిగింది? తెలంగాణలో, హిమాచల్ ప్రదేశ్‌లో ఏం జరిగింది? మోదీని ఎన్నుకున్న ప్రజలే ఆయనను గద్దె దించుతారు’ అని అన్నారు.
దేశంలో సమస్యలకు బీజేపీయే కారణం
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎంత మూల్యమైన చెల్లించేందుకు దేశ ప్రజలు సిద్ధం కావాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పిలుపునిచ్చారు. ‘పార్లమెంటుపై దాడి జరిగింది. దానికి మూల్యం సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలు చెల్లించారు. దేశంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. పేదలు అనేక బాధలు పడుతున్నారు. నిరుద్యోగం పీడిస్తున్నది. వీటన్నింటికీ బీజేపీయే కారణం. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఐక్యంగా ఉండాలి’ అని శరద్‌పవార్ అన్నారు.
మళ్లీ గెలిస్తే పార్లమెంటునే ఎత్తేస్తారేమో
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పార్లమెంటును కూడా లేకుండా చేస్తారేమోనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ‘ప్రజాస్వామ్యం హత్యకు గురవుతున్నది. పార్లమెంటులో ఇన్ని సస్పెన్షన్లు గతంలో ఎన్నడూ లేవు. ఈసారి బీజేపీ మళ్లీ గెలిస్తే.. పార్లమెంటును కూడా రద్దు చేసేస్తారేమో’ అని ఏచూరి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అత్యంత అవసరమని అందుకే ఇండియా కూటమి ఒక్కతాటిపైకి వచ్చిందని చెప్పారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ఎన్నడూ లేదని ఎంపీ శశిథరూర్ అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదని ప్రజలు గుర్తించాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు పరిష్కారం ఒక్కటేనని, అది ప్రజలు మార్పు తెచ్చి, ఇండియా కూటమిని అధికారంలోకి తేవడమేనని అన్నారు.
బీజేపీ ఫాసిస్టు పోకడలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు పోకడలకు పోతున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని హతమార్చుతున్న బీజేపీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని అన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యంలో సుప్రీం అన్న అంబేద్కర్.. ప్రతిపక్షం కూడా ఉండాల్సిందేనని చెప్పారని గుర్తు చేశారు. కానీ.. బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్షాన్ని నిర్మూలిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఫాసిజమేనని అన్నారు. ఈ ఫాసిస్టు నియంత ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగించాలా? అని ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమి పార్టీలు ఐక్యంగా పోరాడి, బీజేపీని ఓడించాలని చెప్పారు. తద్వారానే రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఎంఎం నుంచి మహువా మాఝీ, డీఎంకే నుంచి తిరుచి శివ, ఆర్జేడీ నుంచి మనోజ్ కుమార్ ఝా, టీఎంసీ నుంచి మౌసం నూర్, ఎన్సీ నుంచి హస్నయిన్ మసూదీ, ఆరెస్పీ నుంచి ఎన్‌కే ప్రేమచంద్రన్, ఎస్పీ నుంచి ఎస్టీ హసన్ తదితరులు కూడా హాజరయ్యారు.