జూలైలో వర్షాలే వర్షాలు, సాధారణాన్ని మించి వర్షపాతం … భారత వాతావరణ విభాగం వెల్లడి

దేశవ్యాప్తంగా రైతాంగానికి, రైతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు భారత వాతావరణ విభాగం (ఐఎండీఏ) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పుంజుకున్న నేపథ్యంలో జూలై నెలలో సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని సోమవారం తెలిపింది.

  • Publish Date - July 1, 2024 / 07:29 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతాంగానికి, రైతులపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థకు భారత వాతావరణ విభాగం (ఐఎండీఏ) శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు పుంజుకున్న నేపథ్యంలో జూలై నెలలో సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని సోమవారం తెలిపింది. ఈశాన్య భారతదేశం మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణానికి మించి వర్షపాతం నమోదయ్యేందుకు 80శాతం అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రుతుపవన సీజన్‌ రెండో అర్ధభాగంలో లా నినా సానుకూల ప్రభావం క్రియాత్మకంగా మారి, మరిన్ని వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నదని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర చెప్పారు.
‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాలకన్నా ముందే మే 30వ తేదీన కేరళ, ఈశాన్య ప్రాంతాలను తాకాయి. కానీ.. మహారాష్ట్రపై అవి విస్తరించడంలో తీవ్ర జాప్యం నెలకొన్నది. ఫలితంగా వాయవ్య ప్రాంతం ఎండలతో మండిపోయింది. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లలో దీర్ఘకాలం పొడివాతావరణం కొనసాగింది. జూన్‌ 11 నుంచి జూన్‌ 27 వరకు 16 రోజులపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా దేశంలో ఓవరాల్‌గా సగటు కంటే తక్కువ వర్షపాతం రికార్డయింది’ అని మహాపాత్ర తెలిపారు. జూన్‌లో 165.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను 147.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారత ఆర్థిక వ్యవస్థలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. భారతదేశంలో 50 శాతానికిపైగా వ్యవసాయ భూములకు నీటి సరఫరాకు వర్షమే ఆధారం. దేశంలోని రిజర్వాయర్లు నింపుకొని ఇతర కాలాల్లో వాటిని వ్యవసాయానికి వాడుకోవడానికీ వర్షపు నీరే శరణ్యం.

Latest News