న్యూఢిల్లీ : పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది తీవ్ర గందరగోళం మధ్య సోమవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 33 మంది లోక్‌సభ, 45 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇది అంతకు ముందే డిసెంబర్ 14న 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా మంగళవారం ఉభయసభలకు చెందిన మరో 49 మంది సభ్యులను బయటకు పంపారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు సస్పెన్షన్‌కు గురైనవారి సంఖ్య 141కి పెరిగింది. అంటే.. దాదాపు మూడింట రెండొంతుల మంది ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభాకార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
దీంతో ఎంపీల సస్పెన్షన్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. గతంలో 1989లో ఒకేరోజు 63 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఇంత పెద్ద మొత్తంలో సభ నుంచి సభ్యులను సస్పెండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మోదీ ప్రభుత్వ హయాంలో వివిధ సమయాల్లో ఉభయ సభల నుంచి మొత్తం 25 సందర్భాల్లో సస్పెన్షన్లు జరిగాయి. 94 మంది రాజ్యసభ సభ్యులు, 139 మంది లోక్‌సభ సభ్యులు.. మొత్తం 233 మంది మోదీ ప్రభుత్వంలో సస్పెండ్ అయ్యారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో 2004 నుండి 2014 వరకు 43 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇందులో 7 రాజ్యసభ సభ్యులు, 36 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంతో పోలిస్తే మోదీ ప్రభుత్వంలో దాదాపు 5 రెట్లు ఎక్కువ మంది ఎంపీలు సస్పెండ్ అవడం గమనార్హం. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీల సస్పెన్షన్లు ఎక్కువయ్యాయి.