Site icon vidhaatha

విచారణలో ఇంత జాప్యమేంటి?: సుప్రీంకోర్టు

బెయిలిస్తే సీఎం ఆఫీసుకు వెళ్లొచ్చా?
ఈడీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కేసు ఫైల్స్‌ అందించాలని ఆదేశం
విచారణ మే 9వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందని సుప్రీం కోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో ఇన్వెస్టిగేటింగ్‌ అధికారుల నోట్స్‌ను పరిశీలించేందుకు ఈ కేసుకు సంబంధించి మూడు సంపుటాల ఫైల్స్‌ను తమకు అందించాలని ఈడీని ఆదేశించింది. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం మంగళవారం విచారించింది.

ఈ సందర్భంగా ఈడీ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు ధర్మాసనానికి ఒక నోట్‌ను సమర్పించారు. అందులో అప్రూవర్ల స్టేట్‌మెంట్లను దర్యాప్తు సంస్థ అణచివేసిందన్న కేజ్రీవాల్‌ ఆరోపణను తిరస్కరించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున బెయిల్‌ విజ్ఞప్తిని తాము పరిశీలిస్తున్నామన్న సుప్రీంకోర్టు.. ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని సందర్శించకూడదని, అధికార విధులు నిర్వర్తించకూడదని తాము భావిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన జోక్యం చేసుకోకూడదని తాము కోరుతున్నామని పేర్కొన్నది.

అయితే.. కేజ్రీవాల్‌ తరఫున విచారణకు హాజరైన అడ్వొకేట్‌ అభిషేక్‌ సింఘ్వి.. ముఖ్యమంత్రి ఎలాంటి ఫైల్స్‌పై సంతకాలు చేయరని, సీఎం సంతకం చేయలేదని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ క్షేత్రస్థాయిలో ఏ పనినీ అడ్డుకోకూడదని అన్నారు. శరత్‌ చంద్రారెడ్డి అరెస్టుకు ముందు సెక్షన్‌ 164 సీఆర్పీసీ కింద ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్లతో కూడిన కేసు మొదటి సంపుటిని, మనీశ్‌ సిసోడియా అరెస్టుకు ముందు, అరెస్టు తర్వాతి రెండో సంపుటిని, కేజ్రీవాల్‌ అరెస్టుకు ముందు ఫైల్‌ సంపుటిని.. ఈ మూడింటిని తమకు అందించాలని ఈడీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో కేజ్రీవాల్‌ విచారణకు తీసుకున్న సమయాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విషయాలు బయటపెట్టేందుకు దర్యాప్తు సంస్థ రెండు సంవత్సరాలు తీసుకున్నదని పేర్కొన్నది. ఈ కేసులో సాక్షులుగా, నిందితులుగా ఉన్నవారికి నిర్దిష్ట ప్రశ్నలను నేరుగా ఎందుకు సంధించలేదని ఈడీని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో విచారణను మే 9న సుప్రీంకోర్టు కొనసాగించనున్నది.

మనీలాండరింగ్‌ కేసులో విచారణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున తదుపరి విచారణలో కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటామని మే 3వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలిపింది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్టు చేశారు. తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 15న నోటీసు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కేజ్రీవాల్‌ అరెస్టును ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్‌ 9న సమర్థించింది. ఇందులో చట్టవ్యతిరేకం ఏమీ లేదని, పలుమార్లు సమన్లను కేజ్రీవాల్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఈడీకి మరో మార్గం లేకపోయిందని వ్యాఖ్యానించింది.

Exit mobile version