కారులో వెళ్తూ తుపాకీతో హ‌ల్‌చ‌ల్‌

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రౌడీషీట‌ర్ల‌ను, నేరస్థుల‌ను పోలీసులు ఓ వైపు ఎన్‌కౌంట‌ర్ చేస్తున్నా.. కొంద‌రికి భ‌యం లేకుండా పోతున్న‌ది.

  • Publish Date - November 18, 2023 / 10:01 AM IST
  • సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌
  • న‌లుగురి అరెస్టు.. కారు సీజ్‌
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ర‌హ‌దారిపై ఘ‌ట‌న‌


విధాత‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రౌడీషీట‌ర్ల‌ను, నేరస్థుల‌ను పోలీసులు ఓ వైపు ఎన్‌కౌంట‌ర్ చేస్తున్నా.. కొంద‌రికి పోలీసులు అంటే భ‌యం లేకుండా పోతున్న‌ది. కొంద‌రు రౌడీలు రెచ్చిపోతూనే ఉన్నారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లోనూ విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. తుపాకీ చూపుతూ ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్నారు. తాజాగా హైవేపై వేగంగా వెళ్తున్న కారు కిటికీలోంచి యువకులు పిస్టల్‌ ఊపుతూ వెళ్తున్న‌ ఘటన రాష్ట్రంలో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


ఈ సంఘటన శుక్రవారం ఘజియాబాద్‌లోని సిద్ధార్థ్ విహార్ ప్రాంతంలోని జాతీయ రహదారి 24 సమీపంలో చోటుచేసుకున్న‌ది. కారులో వెనుక కూర్చున్న వ్య‌క్తి పిస్టల్‌ను బ‌య‌ట‌కు పెట్టి చూపుతూ వెళ్తున్నాడు. ఈ ఘ‌ట‌న‌ను వెనుక‌ కారులో వ‌స్తున్న వ్య‌క్తి రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం ప‌ట్టింది.


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వాహనాన్ని గుర్తించారు. కారును సీజ్‌చేశారు. ఆ సమయంలో కారులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కారులో కూర్చున్న నలుగురు యువకుల్లో ఒకరు పిస్టల్ బ‌య‌ట‌కుపెట్టాడ‌ని గుర్తించారు.