సిద్ధ‌రామ‌య్యనే రాముడు.. ఇక అయోధ్యకు వెళ్లడం ఎందుకు..?

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌నే రాముడు అని, అలాంట‌ప్పుడు అయోధ్యకు వెళ్ల‌డం ఎందుకు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు హోల‌ల్‌కేరే

  • Publish Date - January 1, 2024 / 01:42 PM IST

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌నే రాముడు అని, అలాంట‌ప్పుడు అయోధ్యకు వెళ్ల‌డం ఎందుకు అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు హోల‌ల్‌కేరే ఆంజ‌నేయ ప్ర‌శ్నించారు. చిత్ర‌దుర్గ‌లో ఆంజ‌నేయ మీడియాతో మాట్లాడుతుండ‌గా, సిద్ధ‌రామ‌య్య‌ను అయోధ్య‌కు ఎందుకు ఆహ్వానించ‌లేద‌ని జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నించారు. దీంతో ఆయ‌న ఇలా బ‌దులిచ్చారు.

సిద్ధ‌రామ‌య్య‌నే రాముడు. అలాంట‌ప్పుడు అయోధ్య‌కు ఎందుకు వెళ్లాలి..? అది బీజేపీ రాముడు. అయోధ్య రాముడిని బీజేపీ ప్ర‌చారానికి వాడుకుంటుంద‌న్నారు. మా రాముడు సిద్ధ‌రామ‌య్య‌.. ఆయ‌న మా గుండెల్లో నిలిచి ఉన్నార‌ని ఆంజ‌నేయ పేర్కొన్నారు. నేను ఆంజ‌నేయ‌. మ‌రి ఆంజ‌నేయుడు ఏం చేశాడో మీకు తెలుసా..? అని ప్ర‌శ్నించారు. హ‌నుమంతుడికి మ‌రో పేరు ఆంజ‌నేయ. రాముడికి అంకితభావంతో ప‌ని చేసిన వ్య‌క్తి హ‌నుమంతుడు అని రామాయ‌ణంలో ఉంద‌ని ఆంజ‌నేయ‌ తెలిపారు.

జ‌న‌వ‌రి 22న అయోధ్య‌కు రావాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఎలాంటి ఆహ్వానం అందలేద‌ని సీఎం సిద్ధరామ‌య్య స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక వేళ ఆహ్వానం అందితే అప్పుడు వెళ్లాలా..? వ‌ద్దా..? అనేది ఆలోచిస్తాన‌ని సీఎం పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియాగాంధీ రామ మందిరం ఆవిష్క‌ర‌ణ‌కు హాజ‌రు కానున్న‌ట్లు స‌మాచారం.