పాట్నా: మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్‌లో అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న బీహార్ పోలీసులు.. జార్ఖండ్‌లోని దియోగఢ్ జిల్లాలో ఆరుగురు యువకులను శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దియోగఢ్ ఎయిమ్స్ సమీపంలోని ఒక ఇంటిలో వారిని దేవీపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పరంజీత్‌సింగ్ అలియాస్ బిట్టు, చింటు అలియాస్ బల్దేవ్‌కుమార్, కాజు అలియాస్ ప్రశాంత్‌కుమార్, అజిత్‌కుమార్, రాజీవ్‌కుమార్ అలియాస్ కారు.. వీరంతా బీహార్‌లోని నలంద జిల్లాకు చెందినవారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో వారిని ప్రశ్నించేందుకు బీహార్‌కు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు.
నేషనల్ టెస్టింగ్ మే 5న నీట్ యూజీ పరీక్ష నిర్వహించింది. జూన్ 4న ఫలితాలు వెలువడ్డాయి. అయితే.. బీహార్ వంటి రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయిందన్న వార్తలతో ఈ పరీక్షపై భారీ వివాదం ముసురుకున్నది. పరీక్ష రిఫరెన్స్ ప్రశ్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు బీహార్ ఆర్థిక నేరాల విభాగం పోలీసు అధికారులు శనివారం ప్రకటించారు. గత నెలలో తనిఖీల సందర్భంగా పాట్లలోని ఒక ఫ్లాట్‌లో దొరికిన పత్రాలతో వాటిని సరిపోల్చనున్నారు. ఈ కేసులో అరెస్టయిన పలువురికి నార్కో ఎనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
ఈ కేసులో మనీలాండరింగ్ అనుమానాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కేసులో నిందితుల ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దానిని సంస్కరించేందుకు, డాటా రక్షణను మెరుగుపర్చేందుకు ఒక ఉన్నత స్థాయి ప్యానెల్‌ను కేంద్ర ఉన్నతవిద్యాశాఖ శుక్రవారం ఏర్పాటు చేసింది. ఆ ప్యానెల్ సిఫారసుల మేరకు పరీక్ష ప్రక్రియ వ్యవస్థలో మార్పులు చేస్తామని, డాటా భద్రతను మెరుగుపరుస్తామని పేర్కొన్నది. ఏడుగురు సభ్యులు ఉన్న ఈ ప్యానెల్‌కు ఇస్రో మాజీ చైర్మన్ కే రాధాకృష్ణన్ నేతృత్వం వహిస్తారు. అన్ని రంగాల నుంచి నిపుణులు సభ్యులుగా ఉంటారు. వీరిలో ఢిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ బీజే రావు తదితరులు ఉన్నారు.
నీట్ కేసులో జార్ఖండ్‌లో ఆరుగురు అరెస్ట్.. మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు?
