Lalu Prasad Yadav | ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ బుధవారం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరారు. ఢిల్లీ వెళ్లేందుకు పాట్నా ఎయిర్‌పోర్టుకు వస్తున్న క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికే తీవ్ర కిడ్నీ సమస్యతోపాటు.. గుండె సంబంధ సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు ఆయన ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కాల్సి ఉన్నది. అయితే.. అనారోగ్యం కారణంగా ఆయనను పరాస్ హాస్పిటల్‌కు తరలించినట్టు తెలుస్తున్నది. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న లాలు యాదవ్‌కు బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
బుధవారమే ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ‘ఆయన రక్తపోటు, షుగర్ లెవల్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నట్టు తెలిసింది. ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ చెకప్‌ల అనంతరం తిరిగి వస్తారు. ఆందోళన చెందాల్సినదేమీ లేదు. పదమూడు కోట్ల మంది బీహారీల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఆయన ఎల్లప్పుడూ పోరాటం చేసే వ్యక్తి. ఆయన అవసరం దేశానికి ఉన్నది’ అని ఆర్జేడీ నాయకుడు భాయి వీరేంద్ర మీడియాకు చెప్పారు.
కొన్నేళ్లుగా లాలు ప్రసాద్ యాదవ్ వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. 2014లో ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీని ముంబైలో నిర్వహించారు. రక్త నాళాన్ని మార్చడంతోపాటు గుండెకు ఉన్న చిన్న రంథ్రాన్ని కూడా పూడ్చివేశారు. 2022లో సింగపూర్‌లో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆయనకు కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేశారు. ఇటీవలి కాలంలోనే 2024 సెప్టెంబర్‌లో గుండె సంబధిత అంశాలపై ఆయనకు ముంబైలో యాంజియో ప్లాస్టీ చేశారు. ఇలా కొంతకాలంగా అనారోగ్య సమస్యలను లాలు అధిగమిస్తూ వస్తున్నారు. ఆయనకు రక్తపోటు, షుగర్ కూడా ఉండటం మరింత ఇబ్బందికరంగా మారింది.