Sitaram Yechury । సీపీఎం ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ మాజీ సభ్యుడు సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాస కోశ సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 ఏళ్లు. తీవ్ర శ్వాసకోవ ఇన్ఫెక్షన్‌తో ఏచూరిని కొద్ది రోజుల క్రితం ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడ ఆయన కృత్రిమ శ్వాసను అందించారు. ఆయకు బహుళ విభాగాల డాక్టర్ల బృందం చికిత్సను అందించింది. ఆయన మృతదేహాన్ని వైద్య పరిశోధనలు, బోధన అంశాల నిమిత్తం ఎయిమ్స్‌కు అప్పగించనున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ కారత్ నుంచి ఏచూరి 2015లో విశాఖ పట్నంలో జరిగిన సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. వీపీసింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో అనంతరం, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాటి సీపీఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ మార్గదర్శకత్వంలో ఏచూరి అంచెలంచెలుగా ఎదిగి.. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ తొలి ప్రభుత్వ ఏర్పాటులోనూ, ఆ ప్రభుత్వ విధానాల రూపకల్పనలోనూ ఏచూరి కృషి చేశారు. అయితే.. నాటి ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని పార్టీ నిర్ణయం కారణంగా ప్రభుత్వానికి సీపీఎంతోపాటు వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి.
1974లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరిన సీతారాం ఏచూరి.. మరుసటి ఏడాదే సీపీఎం సభ్యత్వాన్ని పొందారు. ఎమర్జెన్సీ సమయంలో కొద్ది నెలలు అరెస్టయ్యారు. సీతారాం ఏచూరి విద్యాభ్యాసం మొత్తం ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్ స్కూల్‌లో పాఠశాల విద్యనభ్యసించిన ఏచూరి.. సీబీఎస్‌ఈ పరీక్షలో నేషనల్ లెవల్‌లో ఫస్ట్ ర్యాంక్ పొందారు. తదుపరి సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఏ (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం, జేఎన్‌యూలో ఆర్థిక శాస్త్రంలో పట్టాపొందారు. రెండింటిలోనూ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు. జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టవడంతో దానిని పూర్తి చేయలేకపోయారు. దేశంలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత వరుసగా మూడు పర్యాయాలు ఆయన జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో ఎస్‌ఎఫ్‌ఐ జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు స్వీకరించారు.
2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఏచూరి.. ఎన్నో ముఖ్యమైన సమస్యలను సభ దృష్టికి తీసుకురావడంతోపాటు.. వాటిపై కీలక చర్చల్లో పాల్గొన్నారు. 2015 మార్చి 3వ తేదీన ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఏచూరి.. దానికి సవరణలు ప్రతిపాదించారు. ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన గెలుపొందింది. ఇలా జరగడం రాజ్యసభ చరిత్రలోనే అది నాలుగోసారి. ఏచూరి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా పొందారు.
నాటి మద్రాస్‌లో స్థిరపడిన తెలుగు కుటుంబంలో సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు 1952లో సీతారాం ఏచూరి జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సీఎస్‌గా పనిచేసిన మోహన్ కందాకు సీతారాం ఏచూరి మేనల్లుడు. మోహన్ కందా సోదరి.. ఏచూరి తల్లి కల్పకం. ఆమె ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ శిష్యురాలు.
ఏచూరి భర్య సీమా చిస్తీ వైర్ సంపాదకురాలిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఆమె బీబీసీ హిందీ సర్వీసెస్ ఢిల్లీ ఎడిటర్‌గా ఉన్నారు. ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్‌గా కూడా ఆమె పనిచేశారు. తమ కుటుంబానికి ఆర్థిక ఆధారం చిస్తీయేనని గతంలో ఒక ఇంటర్వ్యూలో ఏచూరి చెప్పారు. అంతకు ముందు వీణా మజుందార్ కుమార్తె ఇంద్రాణి మజుందార్‌ను సీతారాం ఏచూరి వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె అఖిల ఏచూరి యూనివర్సిటీ ఆప్ ఎడిన్‌బరోలో హిస్టరీ బోధిస్తుంటారు. ఒక కుమారుడు అశీశ్ ఏచూరి (34) కొవిడ్‌తో 2021, ఏప్రిల్ 22న చనిపోయాడు.
సీఎం రేవంత్ రెడ్ది సంతాపం
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు,సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్య సభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.