Avalanche Swallows Sonamarg : సోనామార్గ్‌ను ముంచెత్తిన అవలాంచ్‌.. భయానక దృశ్యాలు

సోనామార్గ్‌లో భయానక మంచు ఉప్పెన! గ్రామాలను ముంచెత్తిన అవలాంచ్.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు వైరల్. కశ్మీర్‌లో స్తంభించిన రవాణా, 50 విమానాలు రద్దు.

Avalanche

Avalanche | ఉత్తరాదిపై గత కొన్ని రోజులుగా భారీగా మంచు పడుతోంది. జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir), హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భారీగా హిమపాతం పడుతోంది. దీంతో కొండప్రాంతాలు మొత్తం శ్వేతవర్ణంలోకి మారిపోయాయి. రహదారులపై భారీగా మంచు పేరుకుపోయింది. దీంతో అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో అక్కడక్కడా అవలాంచ్‌లు (Avalanche) ఏర్పడుతున్నాయి.

తాజాగా జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం హిల్‌స్టేషన్‌ సోనామార్గ్‌ (Sonamarg)లో అవలాంచ్‌ (మంచు ఉప్పెన) ముంచుకొచ్చింది. మంగళవారం రాత్రి 10:12 గంటల ప్రాంతంలో హిమపాతం సంభవించింది. ఇండ్లను మంచు ఉప్పెన ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృష్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పర్వతంపై నుంచి మంచు ఒక్కసారిగా గ్రామంపై పడినట్లు అందులో కనిపించింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అవలాంచ్‌కు సంబంధించిన భయానక దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా, మంగళవారం కూడా కశ్మీర్‌ అంతటా విపరీతంగా మంచు కురిసింది. దీంతో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఇక శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే 50కిపైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో వందలాది పర్యాటకులు లోయలోనే చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధారణ జనజీవనంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి.

కశ్మీర్‌ ప్రాంతంలో అవలాంచ్‌లు (భారీ హిమపాతం, మంచు ఉప్పెన‌) ఏర్పడటం సర్వసాధరణమే. అక్కడ రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా అవలాంచ్‌లు ఏర్పడతాయి. భారీ ఎత్తున మంచు ఒక్కసారిగా విపరీతమైన వేగంతో కొండలపై నుంచి కిందకు రావడాన్ని అవలాంచ్‌ (మంచు తుపాను) అంటారు. దీనివల్ల ఒక్కోసారి ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.

 

ఇవి కూడా చదవండి :

Silver price hits 4 lakh| వెండి రూ.4లక్షలు..బంగారం కూడా ఆల్ టైమ్ రికార్డు
Ajit Pawar plane crash| విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest News