అయోధ్య (Ayodhya) లో భవ్య రామమందిరంలో ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరు కాబోనని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2016లో పోప్ ఫ్రాన్సిస్‌కు ఆమె రాసిన లేఖ ఒకటి తాజాగా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. మదర్‌థెరిసాకు సంబంధించి కేనోనైజేషన్ కార్యక్రమానికి వాటికన్ సిటీ సోనియాగాంధీకి ఆహ్వానం అందించగా.. దానికి ఆమె లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు. తనకు ఆరోగ్యం బాగోలేక ఈ పవిత్ర కార్యక్రమానికి రాలేకపోతున్నానని.. లేకపోతే తప్పకుండా హాజరయ్యేదానినంటూ ఆ లేఖలో సోనియా గాంధీ పేర్కొన్నారు. తన తరఫున ఇద్దరు నాయకులను కార్యక్రమానికి పంపుతున్నామని మార్గరెట్ అల్వా, లుయిజిన్హో ఫలేరియో పేర్లను ప్రతిపాదించారు.
‘మదర్‌థెరిసా పవిత్రతను, మహిమను గుర్తిస్తున్నందుకు 2 కోట్ల మంది క్యాథలిక్కులు సహా ప్రతి భారతీయుడు గర్విస్తున్నారు. ఒకవేళ నేను అనారోగ్యానికి గురికాకుండా ఉంటే తప్పకుండా ఈ పవిత్ర కార్యంలో భాగస్వామినై ఉండేదాన్ని. సేవ ద్వారా దేవునికి సేవ చేసిన ఆ మహిళా మూర్తిని గౌరవించుకునేదానిని’ అని సోనియా ఆ లేఖలో రాసుకొచ్చారు. మరోవైపు రామమందిరానికి తాము హాజరుకాబోవడం లేదని సోనియా సహా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఆధిర్ రంజన్ చౌధురిలు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఎంతో గౌరవంగా రామమందిరం ట్రస్టు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నామని ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై అధికార బీజేపీ మండిపడింది. బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ నాయకులు రామమందిర ప్రతిష్ఠాపనకే కాకుండా జీ-20 సమావేశానికి, పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి, రాష్ట్రపతి ప్రసంగానికి కూడా హాజరు కాలేదని ఆ పార్టీ ఎంపీ సుధాంశు త్రివేది దుయ్యబట్టారు.