Site icon vidhaatha

Vande Bharat | ప్రత్యేక వందే భారత్‌ రైలు పట్టాలెక్కించిన రైల్వేశాఖ.. పరుగులు తీసేది ఈ మార్గంలోనే..!

vande-bharat-express

Vande Bharat | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ మరిన్ని రూట్లలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. తాజాగా వేసవి నేపథ్యంలో ప్రత్యేక వందే భారత్‌ స్పెషల్‌ రైళ్లను సైతం నడిపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా చెన్నై – నాగర్‌ కోయిల్‌ మధ్య సమ్మర్‌ స్పెషల్‌ రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.

ఈ రైలు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. అయితే, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్‌ వందే భారత్‌ రైలును నడిపించడం గమనార్హం. ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ రైల్వే తమిళనాడులోని వివిధ ప్రాంతాలు, పొరుగు రాష్ట్రాల్లోని నగరాలను కలుపుతూ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వేసవి కాలంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ప్రత్యేక వందే భారత్‌ను ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు శుక్ర, శని, ఆదివారాల్లో చెన్నై ఎగ్మోర్‌ నుంచి నాగర్‌ కోయిల్‌ సెక్టార్‌ వరకు నడువనున్నది.  రైలు నంబర్‌ 06057 చెన్నై ఎగ్మోర్‌ నుంచి నాగర్‌ కోయిల్‌ వందే భారత్‌ ట్రై వీక్లీ స్పెషల్‌.. చెన్నై ఎగ్మోర్‌ నుంచి ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 06058 నాగర్‌కోయిల్-చెన్నై ఎగ్మోర్ వందే భారత్ నాగర్‌కోయిల్ నుంచి మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్‌లో నెలలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ నెల 5, 6, 7, 12, 13, 14, 19, 20, 21, 26, 27, 28 తేదీల్లో రెండుమార్గాల మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వేశాఖ తెలిపింది. ఈ రైలు తాంబరం, విల్లుపురం, తిరుచ్చి, దిండిగల్, మధురై, విరుదునగర్, తిరునెల్వేలి స్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ వివరించింది. ప్రస్తుతం ఏప్రిల్‌ వరకు అందుబాటులో ఉంటుందని.. ఆ తర్వాత రద్దీని దృష్టిలో పెట్టుకొని పొడిగిస్తామని రైల్వేశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

Exit mobile version