న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నగరాలను నిర్మించకపోతే ప్రస్తుతం ఢిల్లీ ఎదుర్కొంటున్న దుస్థితిని ఇప్పటి నగరాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ‘దేశవ్యాప్తంగా కొత్త నగరాల అవసరం ఉన్నది. కొత్త సిటీలకు ప్రణాళిక వేయకుంటే ప్రతి నగరం కూడా ఢిల్లీలా తయారవుతుంది’ అని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) జాతీయ అధ్యక్షుడు జీ హరిబాబు అన్నారు. అధిక జనాభా, పట్టణీకరణ భారతదేశానికి కొత్తేమీ కాదు. కానీ ఏళ్లు గడిచిన కొద్దీ పరిస్థితి తీవ్రంగా మారుతున్నది. ఈ చలికాలంలో సముద్రతీరంలోని ముంబై మహానగరం కూడా దట్టమైన స్మాగ్, నాణ్యతలేని గాలితో కునారిల్లుతున్నది.
సాధారణంగా గాలిని నిత్యం శుభ్రం చేసే సముద్ర తీర ప్రాంత నగరాలను సాధారణ నగరాలతో పోల్చలేమని, కానీ.. అవి కూడా ప్రత్యేకించి గతంలో కాలుష్య రహిత నగరాలు కూడా నీరు, విద్యుత్తు కొరత, చెత్త నిర్వహణకు సమర్థ యంత్రాంగం లేకపోవడం, అంతుచిక్కని వాహన ట్రాఫిక్ వీటన్నింటి ఫలితంగా వాయు నాణ్యత పడిపోవడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని టాప్‌టెన్ అత్యధిక కాలుష్య నగరాల్లో మన దేశానికి చెందిన నగరాలూ కూడా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్తగా చక్కటి ప్రణాళికాయుతమైన నగరాలను నిర్మించడమే దీనికి పరిష్కారమని నారెడ్కో చెబుతున్నది. ‘ప్రతి రాష్ట్రం కొత్త నగరాల నిర్మాణంపై దృష్టిసారించాలి. అందుకు కనీసం 20 నుంచి గరిష్ఠంగా 25 ఏళ్లు పడుతుంది. ఇలాగైతేనే మనం మన ప్రస్తుత నగరాలపై భారాన్ని తొలగించగలం’ అని హరిబాబు చెప్పారు.
భారతదేశంలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదబాద్.. ఈ ఏడూ మెట్రో నగరాలుగా ఉన్నాయి. వీటితోపాటు మరో 20 వరకూ మినీ మెట్రోలు ఉన్నాయి. కానీ.. కనీసం 30 మెట్రో నగరాల ఆవశక్యత ఉన్నదని హరిబాబు చెప్పారు. తద్వారానే అమత్‌కాల్ ఉద్దేశాలను పరిపుష్టం చేయగలమని అన్నారు. వేగంగా సాగుతున్న పట్టణీకరణ స్థానంలో తిరుగు వలసలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. లేనిపక్షంలో 2050 నాటికి పట్టణ జనాభా ప్రస్తుత 32 శాతం నుంచి 51 శాతానికి పెరిగిపోతుందని ఆయన హెచ్చరించారు. పట్టణాల్లో 51 శాతం జనాభా అంటే దాదాపు 80 కోట్లతో సమానమని చెప్పారు. రెండు కోట్ల జనాభా ఉన్న నగరాలు నాలుగు కోట్ల జనాభా ఉన్న నగరాలుగా మారితే జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతాయని అన్నారు. ప్రతి రాష్ట్రానికీ కొత్త నగరాలు అవసరమేనని స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలు సృష్టిస్తే కొత్త నగరాలకు జనాభా రావడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.