న్యూఢిల్లీ : దీపావళి వేళ.. గ్రీన్ క్రాకర్స్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతిస్తూ తీర్పు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీపావళి సమయంలో నాలుగు రోజుల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. గ్రీన్ క్రాకర్స్‌తో వారిని పండగ చేసుకోవడానికి అనుమతించాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం షరతులతో గ్రీన్ కాకర్స్ కు అనుమతించింది.
నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోకి బయటి నుంచి ఎలాంటి బాణసంచా తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలు గాలి నాణ్యతా సూచీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది. స్మగ్లింగ్ చేసిన బాణసంచాను వాడటం వల్ల గ్రీన్ క్రాకర్స్ వినియోగించిన దానికంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని… అందుకే ఈ పరిస్థితులను బ్యాలెన్స్ చేసేలా చర్యలు ఉండాలని.. పర్యావరణానికి హాని కలగకుండా మితంగా వాడేందుకు అనుమతిస్తున్నాం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది తాత్కాలిక చర్య మాత్రమేనని స్పష్టం చేసింది.
దీపావళిరోజున రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలపాటు పర్యావరణహితమైన బాణసంచా కాల్చడానికి అనుమతివ్వాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు. కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచా వాడకాన్ని అనుమతించవచ్చని, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ ఆమోదించిన పర్యావరణహిత బాణసంచా మాత్రమే తయారుచేసి, విక్రయించేలా చూడాలని కోరారు. పేలుడు స్వభావమున్న టపాసులు తయారుచేయకుండా ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పరిమితులతో కూడిన అనుమతులతో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతించింది.