మే 4వ తేదీకి ముందే పేపర్ లీకేజీ : సీజేఐ అనుమానాలు
విధాత, హైదరాబాద్: నీట్-యూజీ 2024 పరీక్ష పత్రం లీకేజీ, అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా నీట్- యూజీ పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్న విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఒకే ప్రశ్నకు రెండు సరైన సమాధానాలు ఇచ్చారని, మార్కులు మాత్రం ఒక్కదానికే వేశారంటూ పిటిషనర్లు వాదించారు.
దానికి మార్కులు ఇచ్చినా, ఇవ్వకపోయినా మెరిట్ లిస్టు మారే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. సదరు ప్రశ్నకు సరైన సమాధానం కోసం సంబంధిత సబ్జెక్టుకు చెందిన ముగ్గురు నిపుణులను ఏర్పాటు చేసి, జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు దానిపై సమాధానం సమర్పించాలని ఐఐటీ- దిల్లీ డైరెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
మే 4వ తేదీకి ముందే పేపర్ లీకేజీ: సీజేఐ డీవై చంద్రచూడ్
అంతకుముందు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. మే 4కు ముందే పేపర్ లీక్ అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. బీహార్ పోలీసుల దర్యాప్తు నివేదికను ప్రస్తావిస్తూ.. స్ట్రాంగ్ రూమ్ నుంచే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా? అని ప్రశ్నించింది. నిందితులకు మే4వ తేదీ రాత్రి గుర్తుంచుకోవాలని చెప్పారంటే లీక్ ఆ తేదీ కంటే ముందే జరిగి ఉండొచ్చని సీజేఐ డీవై చంద్రచూడ్ అనుమానం వ్యక్తంచేశారు.
అలా అయితే.. స్ట్రాంగ్ రూమ్ వాలెట్లో ప్రశ్నపత్రం బయటకు వచ్చిందా.. అని ప్రశ్నించారు. బీహార్ పోలీసుల దర్యాప్తు రిపోర్టును ఉటంకిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ల పక్షాన వాదిస్తున్న న్యాయవాది నరేందర్ హుడా తన వాదనలు వినిపిస్తూ.. 161 వాంగ్మూలాలు పరీక్ష పేపర్ లీక్ మే 4వ తేదీ కంటే ముందే చోటుచేసుకొందని బలంగా చెబుతున్నట్లు పేర్కొన్నారు. బీహార్ పోలీసుల రిపోర్టు ప్రకారం సంబంధిత బ్యాంకుల్లో ప్రశ్నపత్రాలను డిపాజిట్ చేయటానికి ముందే లీకైందని పేర్కొన్నారు.
మే 3వ తేదీ లేదా అంతకంటే ముందే పేపర్ బయటకు వెళ్ళిండొచ్చని పేర్కొన్నారు. ఇదేదో 5-10 మంది విద్యార్థుల కోసం చేసిన లీకేజీ కాదని హుడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఓ గ్యాంగ్ ఎప్పటినుంచో ఈ పని చేస్తోందని పేర్కొన్నారు. సంజీవ్ ముబియా, ఇతర కీలక నిందితులు అరెస్టు కాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. ఒకచోట ప్రశ్నపత్రాన్ని రిక్షాలో కూడా తరలించారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
నీట్-యూజీ 2024కు సంబందించి దాఖలైన పిటిషన్లపై సోమవారం నుంచి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి. పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం విచారిస్తోంది. ఇందులో నీటకు సంబందించిన 40 పిటీషన్లు ఉన్నాయి. వీటిల్లో వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు అన్నింటిని సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలన్న ఎన్టీఏ అభ్యర్ధన కూడా ఉండటం గమనార్హం.