న్యూఢిల్లీ : చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం(bill approvals) కోసం రాష్ట్రపతి(President), గవర్నర్ల(Governor)కు గడువు నిర్దేశించడంపై ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం కీలక తీర్పు(Supreme Court judgment) వెలువరించింది. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు(no deadline for bill assent)అని చీఫ్ జస్టీస్ బీఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం(BR Gavai bench decision) స్పష్టీకరించింది. బిల్లుల విషయంలో గవర్నర్లకు మూడు ఆప్షన్లు మాత్రమే ఉంటాయని..వాటిలో బిల్లు ఆమోదం, నిలిపివేయడం, అసెంబ్లీకి తిరిగి పంపడమే ఉంటాయని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూడు అధికారాలు కాకుండా నాలుగో అధికారం గవర్నర్లకు ఉండదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
చట్టసభలు ఆమోదించిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కోర్టులు గడువు విధించడాన్ని ప్రశ్నిస్తూ ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి రిఫరెన్స్ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లులకు ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు అని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది.
తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసుతో వివాదం
అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను పలు రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెడుతుండడం సంగతి తెలిసిందే. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సమస్య అధికంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ బిల్లుల పెండింగ్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై ఈ ఏడాది మే నెలలో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బిల్లుల ఆమోదానికి మూడు నెలల గడువు విధిస్తూ ఆలోపు ఆమోదించాల్సిందేనని.. లేకుంటే ఆమోదించినట్లేనని పేర్కొంది. గవర్నర్ విషయంలోనే కాదు.. రాష్ట్రపతి విషయంలోనూ ఇది వర్తిస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పులో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా భాగం అయ్యారు. సుప్రీం తీర్పుతో గవర్నర్ ఆమోదించకుండా పక్కనపెట్టిన పది బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అయితే రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ తాము అప్పీళ్లను విచారించబోమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించి.. వివరణ, సలహాలు కోరారు. ‘బిల్లులకు ఆమోదం అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని న్యాయవ్యవస్థ గడువులు నిర్దేశించవచ్చా’ అని స్పష్టత కోరారు.
భిన్నవాదనలతో సాగిన కేసు విచారణ
రాష్ట్రపతి సుప్రీంకోర్టును వివరణ అడిగిన అంశాలకు సంబంధించి జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ పీఎస్ నర్సింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదన వినిపించాయి. రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయవ్యవస్థ గడువు విధించడం సరికాదని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టుకు వివరించారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి అధికారాల్లో జోక్యం చేసుకోవడం వివిధ వ్యవస్థల మధ్య రాజ్యాంగం చేసిన అధికారాల విభజనను ఉల్లంఘించడమేనని వాదించారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న మహారాష్ట్ర, ఛత్తీసగఢ్ రాష్ట్రాలు కేంద్ర వాదనను సమర్థించాయి. మరోవైపు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు గవర్నర్లకు గడువుపెట్టడం సరైనదేనంటూ సుప్రీం తీర్పును సమర్థించాయి. వాదనలన్నీ విన్న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సెప్టెంబరు 11న తమ నిర్ణయాన్ని రిజర్వు చేసింది. గురువారం తుది తీర్పు వెలువరించింది. ఆదివారం పదవి విరమణ చేయబోతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదంపై గడువు నిర్దేశిస్తూ ఈ ఏడాది మేలో తీర్పు ఇచ్చిన ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఒకరు. అయితే రాష్ట్రపతి రిఫరెన్స్ తర్వాతా ఈ వ్యవహారంలో తెరపైకి వచ్చిన భిన్న వాదనలను పరిగణలోకి తీసుకున్న గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్రపతి, గవర్నర్లకు బిల్లుల ఆమోదం విషయంలో కోర్టులు గడువు నిర్దేశించలేవు అని తీర్పు వెలువరించడం గమనార్హం.
