- ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలి
- రాజ్యాంగం పూర్తిస్థాయి అమలుకు పోరాడాలి
- తెలంగాణ జన సమితి నేత ధర్మార్జున్
Walk for Constitution | ఎన్నో అధ్యయనాలతో ప్రజాస్వామిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాలకవర్గాలు అమలు చేయడం లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు. రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసేందుకు పోరాటాలు తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణంలో వాక్ ఫర్ కాన్‌స్టిట్యూషన్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగం పెను ప్రమాదం ఎదుర్కోబోతున్నదని ఆయన హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని బలహీనపరిచే కుట్రలు చేస్తూనే ఉన్నదని, రేపు పూర్తిస్థాయిలో మార్చడానికి సన్నద్ధమవుతుందని చెప్పారు. భారత ప్రజలైన మనం ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని ధర్మార్జున్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ పీఠికను కరపత్రాల రూపంలో ముద్రించి, పట్టణంలో పెద్ద ఎత్తున పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయినణ కిరణ్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు తండు నాగరాజు గౌడ్, తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కుంచం చంద్రకాంత్ ఉపాధ్యక్షుడు వీరేశ్ నాయక్, యువజన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగు నాయక్, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, పార్టీ జిల్లా నాయకులు సుమన్ నాయక్, వలికి గోవర్ధన్, ధారావత్ శీను నాయక్, పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఫరీద్ తదితరులు పాల్గొన్నారు.