Delhi University | అంబేద్కర్‌ తత్వచింతన కోర్సు ఆపేద్దాం: ఢిల్లీ వర్సిటీ ప్యానల్‌

Delhi University నూతన విద్యావిధానంలో భాగంగా ప్రతిపాదన తీవ్రంగా వ్యతిరేకించిన ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ విధాత: చరిత్రను కాషాయమయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్‌ను సైతం చరిత్ర నుంచి చెరిపి వేసేందుకు ప్రయత్నిస్తున్నదా? ఢిల్లీ యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే ఈ అనుమానాలు రాక తప్పదు. అంబేద్కర్‌ తత్వచింతన కోర్సును ఇక ఆపేద్దామని యూనివర్సిటీ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనను ఇదే యూనివర్సిటీలోని ఫిలాసఫీ విభాగం తీవ్రంగా వ్యతిరేకించింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అంబేద్కర్స్‌ […]

  • Publish Date - May 23, 2023 / 12:17 PM IST

Delhi University

  • నూతన విద్యావిధానంలో భాగంగా ప్రతిపాదన
  • తీవ్రంగా వ్యతిరేకించిన ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌

విధాత: చరిత్రను కాషాయమయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్‌ను సైతం చరిత్ర నుంచి చెరిపి వేసేందుకు ప్రయత్నిస్తున్నదా? ఢిల్లీ యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నాలు గమనిస్తే ఈ అనుమానాలు రాక తప్పదు. అంబేద్కర్‌ తత్వచింతన కోర్సును ఇక ఆపేద్దామని యూనివర్సిటీ స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదన చేసింది.

ఈ ప్రతిపాదనను ఇదే యూనివర్సిటీలోని ఫిలాసఫీ విభాగం తీవ్రంగా వ్యతిరేకించింది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా అంబేద్కర్స్‌ ఫిలాసఫీ అనే కోర్సును తీసేద్దామన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని వర్సిటీ వైఎస్‌ చాన్స్‌లర్‌ యోగేశ్‌ సింగ్‌ను కోరింది.

అంబేద్కర్స్‌ ఫిలాసఫీ కోర్సును బీఏ (ఫిలాసఫీ) నుంచి ఉపసంహరించాలని మే 8న సమావేశంలో వచ్చిన ప్రతిపాదనపై మే 12వ తేదీన పీజీ, యూజీ కరికులం కమిటీ సమావేశంలో మళ్లీ చర్చకు వచ్చిందని తెలుస్తున్నది.

ఈ సందర్భంగా దేశంలోని మెజారిటీ ప్రజల సామాజిక ఆకాంక్షలకు ప్రాతినిథ్యం వహించే దేశీయ తాత్వికుడు, మేధావి అంబేద్కర్‌ అంటూ ఈ ప్రతిపాదనను కరికులం కమిటీ గట్టిగా వ్యతిరేకించిందని సమాచారం. అంతేకాకుండా అంబేద్కర్‌పై పరిశోధనలు రోజు రోజుకు పెరుగుతున్న విషయాన్ని కరికులం కమిటీ ప్రస్తావించింది.

నూతన విద్యావిధానంలో భాగంగా స్టాండింగ్‌ కమిటీ అంబేద్కర్‌ కోర్సును తీసేద్దామని ప్రతిపాదించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్టాండిగ్‌ కమిటీ సభ్యుడు ఒకరు చెప్పారని ఒక ఆంగ్ల వార్తా పత్రిక తెలిపింది. అకడమిక్‌ విషయాల్లో నిర్ణయాత్మక శక్తి అయిన అకడమిక్‌ కౌన్సిల్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

అయితే.. అంబేద్కర్‌ కోర్స్‌ను ఆపివేయాలని సలహా ఇవ్వలేదని, పాత, కొత్త కోర్సులను కలిసి సమగ్రంగా తీసుకురావాలని మాత్రమే చెప్పామని స్టాండ్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కాలేజీల డీన్‌ బలరాం ఫణి చెప్పారు. మరిన్ని కాలేజీలు ఈ కోర్సును అడాప్ట్‌ చేసుకునే విధంగా రూపొందించాలని అన్నారు.

అన్ని రంగాలకు చెందిన మేధావుల తత్వచింతనను కూడా జోడించాలని భావిస్తున్నట్టు తెలిపారు. పైకి ఎలా చెబుతున్నా.. అంబేద్కర్‌ తత్వ చింతన కోర్సును ఆపివేయాలని ప్రతిపాదన వచ్చిందని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.

అయితే.. ఫిలాసఫీ విభాగం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సిలబస్‌ రివిజన్‌పై ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ అంబేద్కర్‌ తత్వ చింతన కోర్సును కొనసాగించాలని, దానితోపాటు మరికొందరు తత్వవేత్తలను సైతం జోడించాలని సూచించినట్టు తెలుస్తున్నది. అంబేద్కర్‌ తత్వ చింతన కోర్సును 2015లో ప్రవేశపెట్టారు. అందులో అంబేద్కర్‌ జీవితం, కీలక రచనలు, ఆయన లక్ష్యాలు, ఆయన పరిశోధన పద్ధతులు వంటి అంశాలు ఉన్నాయి.

Latest News