Site icon vidhaatha

EVKS Elangovan । తమిళనాడు కాంగ్రెస్‌ నేత ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ మృతి.. జీవితంలో ఇన్ని ట్విస్టులా?

EVKS Elangovan । తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఈరోడ్‌ తూర్పు ఎమ్మెల్యే ఈవీకేస్‌ ఇలంగోవన్‌ శనివారం చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఇలంగోవన్‌ను శుక్రవారం హాస్పిటల్‌లో చేర్చారు. మరికొద్ది రోజుల్లో డిసెంబర్‌ 21 నాటికి ఆయనకు 74వ జన్మదినం జరుపుకోవాల్సింది. గంభీరమైన ఉపన్యాసాలు, చురకల్లాంటి వ్యాఖ్యలతో ఇలంగోవన్‌ ప్రసంగాలు ఉండేవి. ఆయన కుమారుడు తిరుమహన్‌ ఇవేరా 2022లో చనిపోవడంతో ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో ఇలంగోవన్‌ విజయం సాధించారు. ద్రవిడ ఉద్యమ దిగ్గజం పెరియార్‌ రామస్వామికి ఇలంగోవన్‌ ముని మనుమడు. తమిళనాడులో ద్రవిడ రాజకీయాలకు పునాదులు వేసిన కరుణానిధి వంటివారి సమకాలికుడైన మరో దిగ్గజ నేత ఈవీకే సంపత్‌ కుమారుడు.

జీకే మూపనార్‌ నేతృత్వంలో ఒక వర్గం కాంగ్రెస్‌ నుంచి చీలిపోయి తమిళ మనీల కాంగ్రెస్‌ పేరుతో ఏర్పాటైన తర్వాత తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీకి ఇలంగోవన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. 2000-2002లో తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ బాగా దెబ్బతిన్నది. ఆ సమయంలో మూపనార్‌, పీ చిదంబరం తమ పార్టీలతో తమిళనాడులో ప్రజాదరణ పొందారు. మరోసారి 2014 నుంచి 2016 వరకూ ఆయన కాంగ్రెస్‌ తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పూర్తిగా ప్రాభవం కోల్పోయింది. మొదటిసారిగా ఆయన 1984లో సత్యమంగళం నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరి 2004లో గోబిచెట్టిపాళ్యం నుంచి ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ స్థానం కనుమరుగైంది. కేంద్రంలో పెట్రోలియ, సహజ వాయువుల శాఖ, వాణిజ్యం, పరిశ్రమల శాఖలకు సహాయ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2019 ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి తరఫున థేని నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీరుసెల్వం కుమారుడు రవీంద్రనాథ్‌ కుమార్‌ చేతిలో ఆయన పరాజయం చవిచూశారు.

తన తల్లి సులోచన సంపత్‌.. అన్నా డీఎంకే నేతగా ఉండేవారు. జయలలితకు సన్నిహితురాలిగా కూడా పేరుంది. అయినప్పటికీ జయలలితను, అన్నా డీఎంకే విధానాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవారు. 1988 జనవరి 28న మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ భార్య జానకి అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన కొద్దిమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఇలంగోవన్‌ కూడా ఒకరు. అప్పట్లో జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా ఓటేయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించి, విప్‌ జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించారు. 1988లో సినీ నటుడు శివాజీ గణేశన్‌ తమిళగ మున్నేట్ర మున్నానీ (టీఎంఎం) పేరిట రాజకీయ పార్టీని స్థాపించినప్పుడు కొంత కాలం ఆయన వెంట ఉన్నారు.

Exit mobile version