Merge 14 Telangana Villages with Maharashtra | మహారాష్ట్ర : మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ లోని 14 గ్రామాలు త్వరలో మహారాష్ట్రలో విలీనం కానున్నాయి. ఈ మేరకు విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాంకులే అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో అధికారులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాజూరా, జీవతి తాలూకాలో ఉన్న తెలంగాణకు చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయనున్నట్లు తెలిపారు.
14 గ్రామాల రెవెన్యూ రికార్డులు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ గ్రామాల ప్రజలు మహారాష్ట్రకు చెందిన ఓటర్లని, మహారాష్ట్రలోనే ఓటు వేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ వద్ద ఎలాంటి రికార్డులు లేవని మంత్రి గుర్తు చేశారు. కానీ, సరిహద్దు వివాదాల గురించి తాను మాట్లాడటం సముచితం కాదన్నారు. 14 గ్రామాల ప్రజలు, అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నేతల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విలీన ప్రక్రియ ప్రారంభం అయిందని, తెలంగాణలోని 14 గ్రామాలను చంద్రపూర్ జిల్లాలో అధికారికంగా విలీనం చేయనున్నట్లు మంత్రి చంద్రశేఖర్ స్పష్టం చేశారు.