ఎల్‌నినో (El Nino) ప్రభావంతో 2023 కంటే 2024 అత్యంత వేడిగా ఉంటుందని యునైటెడ్ నేషన్స్ (UN) అనుబంధ సంస్థ వరల్డ్ మెటరలాజికల్ అసోసియేషన్ (WMO) వెల్లడించింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెలా నమోదైన ఉష్ణోగ్రతలను నమోదు చేసి అధ్యయనం చేశామని.. దీని ప్రకారం.. 2024లోనూ ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రతల తాకిడి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపింది. ద యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలపై ఒక నివేదికను ఇచ్చింది. దీని ప్రకారం.. మూడొంతుల్లో ఒక వంతు 2023 కన్నా 2024 వేడిగా ఉండే ప్రమాదముంది . అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు నమోదైన 5 సంవత్సరాల్లో 2024 ఉండటానికి 99 శాతం అవకాశముంది.
ఉష్ణోగ్రతలు, వాతావరణమార్పుల దుష్ఫరిణామాల కోణంలో చూసుకుంటే 2024 అత్యంత ఘోరంగా ఉంటుందని నాసా వాతావరణ శాస్త్రవేత్త గేవిన్ స్మిత్ అభిప్రాయపడ్డారు. ‘నేను ఈ పరిస్థితిని 50-50 అంటాను. 2023 కన్నా 2024 వేడిగా ఉండటానికి 50 శాతం అవకాశం ఉంది. దాని కన్నా కాస్త తక్కువ వేడిగా ఉండటానికి 50 శాతం అవకాశముంది. భూమి ఇప్పటికే మానవుడికి అంతు చిక్కని వాతావరణ మార్పులకు లోనైంది. మనం మరిన్ని కష్టాలలోకి జారిపోతున్నామనడానికి పెద్ద ఆధారాలు అవసరం లేదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. భూ చరిత్రలోనే 2023 అనేది అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా డబ్ల్యూఎంఓ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది పారిశ్రామిక యుగంతో పోల్చుకుంటే సగటున 1.45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. ఇది 2024లో 1.18 డిగ్రీల సెల్సియస్ గా ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కిటిక్, నార్తర్న్ నార్త్ అమెరికా, మధ్య ఆసియా, నార్త్ అట్లాంటిక్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయని చెబుతున్నారు. వాతావరణ మార్పులే భవిష్యత్తు తరాలు ఎదుర్కొనే అత్యంత కఠినమైన సవాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు.