ఈ వేసవి నిప్పుల వానే..

గతేడాది మండిపోయిన ఎండలు గుర్తున్నాయా? వాటిని మరిపించే రీతిలో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు

  • Publish Date - January 23, 2024 / 03:03 PM IST
  • ఎల్ నినో ప్ర‌భావంతో మండిపోనున్న ఎండ‌లు
  • గతేడాది కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే
  • సీజ‌న్‌లో సాధార‌ణ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

విధాత‌: గతేడాది మండిపోయిన ఎండలు గుర్తున్నాయా? వాటిని మరిపించే రీతిలో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అందులోనూ గత ఏడాదికంటే రెండు మూడు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని చెబుతున్నారు. వెరసి.. రాబోయే ఎండాకాలంలో నిప్పుల వాన తప్పదని అంటున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో గత ఏడాదే ఎల్‌నినో సంకేతాలు మొదలయ్యాయి. అవి గత సీజన్‌లో బలపడకపోవడంతో ఆ ఏడాది వర్షాకాలం ఎగుడుదిగుడుల మధ్య సాగింది. గత జూలై నెల కనీవినీ ఎరుగని గరిష్ఠ ఉష్ణోగ్రతల నెలగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఆ రికార్డులు చెల్లాచెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ‌, ఏపీ త‌దిత‌ర ద‌క్షిణాది ప్రాంతాల‌పై ఎల్ నినో ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, అందుకే ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతాయ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ‌త ఏడాదికి భిన్నంగా చ‌లికాలంలో కూడా ఉష్ణోగ్ర‌తలు అధికంగా క‌నిపిస్తున్నాయంటున్నారు.


ఫిబ్ర‌వ‌రి రెండ‌వ వారం వ‌ర‌కు చ‌లి అధికంగా ఉండాల్సి ఉండ‌గా ఈ ఏడాది చ‌లికాలం ఉందా? అన్న సందేహాలు క‌లిగే విధంగా ఉష్ణోగ్ర‌త‌లు ఉన్నాయ‌ని ఒక సీనియ‌ర్ ప‌ర్యావ‌ర‌ణవేత్త తెలిపారు. ఈ ఏడాది చ‌లి చాలా త‌క్కువ‌గా ఉంద‌ని, ఎల్ నినో ప్ర‌భావం వ‌ల్ల‌ ఉత్త‌రాది గాలులు ద‌క్షిణాదికి రాకుండా ఆగిపోవడమే దీనికి కారణమని ఆయన చెప్పారు. ఉత్త‌రాది నుంచి చ‌లిగాలులు రాక‌పోవ‌డం వ‌ల్ల చ‌లికాలంలో కూడా ఉష్ణోగ్ర‌త‌లు గ‌త ఏడాది కంటే అధికంగానే ఉన్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్ర‌తలు ఇంకా పెరిగే అవ‌కశం ఉందంటున్న ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు.. మే నెల‌లో ఎక్కువ రోజులు వేడిగాలులు కొనసాగే ప్ర‌మాదం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అయితే జూన్ నాటికి ఎల్ నినో ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎల్ నినో ప్ర‌భావం త‌గ్గిన త‌రువాత రాష్ట్రంలో సాధార‌ణ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంటుందని చెబుతున్నారు. గ‌డిచిన వ‌ర్షాకాలం సీజ‌న్‌లో స‌రిగ్గా వ‌ర్షాలు కురువలేద‌ని, కానీ వ‌చ్చే వ‌ర్షాకాలంలో సాధార‌ణ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, రిజ‌ర్వాయ‌ర్ల‌కు నీరు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ఎండలు మండించి.. నీళ్లు చల్లనున్నాయన్నమాట!