రామాలయం ప్రారంభోత్సవం రాజకీయం కాదు.. కాంగ్రెస్ వైఖరి హిందూ వ్యతిరేకమే

జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదని, రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల

  • Publish Date - January 11, 2024 / 12:33 PM IST
  • కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజం

విధాత : జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రాజకీయ కార్యక్రమం కాదని, రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రామాలయం ప్రారంభోత్సవం కోసం దేశంలోని ప్రజలంతా ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారన్నారు. రామాలయ ప్రారంభోత్సవం.. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని తమ హిందూ వ్యతిరేకతను, సూడో సెక్యులరిజాన్నిమరోసారి చాటుకున్నారన్నారు.


రామాలయ ప్రారంభోత్సవం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు దివాళా కోరుతనానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. రాముడి ఉనికినే కొట్టివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. బహిష్కరణ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాలను, జీ 20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించడాన్ని గుర్తి చేశారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరు అవుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.


తెలంగాణలో అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి ?.. పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి ? అని ఫైర్ అయ్యారు. వారం రోజులు తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారు ? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. రాహుల్ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాహుల్ గాంధీ తిరగాలనుకుంటే చైనా బార్డర్, పాకిస్థాన్ బార్డర్, గోవా బీచ్ లో తిరగమనండి.. ఎవరు వద్దన్నారు అని విమర్శించారు.


కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కిషన్‌రెడ్డి బస్తీబాటలో భాగంగా బేగంపేట, ఓల్డ్ పాటిగడ్డ బస్తీలలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. పాటిగడ్డలో 15ఏండ్ల కింద కట్టిన ఇండ్లను ఇప్పటిదాకా పేదలకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ జనాభాలో 30శాతం ఉన్న హైద్రాబాద్ నగరంలో పేదలకు ఇండ్ల సమస్య ప్రధానంగా మారిందన్నారు. జూబ్లిహీల్స్‌, బంజారాహీల్స్‌, ఎకనామిక్స్ సిటీ, హైటెక్ సిటీల్లో ఫ్లైవోవర్లు కట్టి రంగులు పూసి అంతర్జాతీయ నగరం చేశామని ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ ఓట్లు దండుకున్నాడని, మెయిన్ రోడ్లు దిగి బస్తీలో పర్యటించాలని ఆయనకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదన్నారు.