ఓబీసీ మోర్చా సమావేశంలో వ్యాఖ్యలు
సీఎం రావడానికి ముందే బయటకు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. సోమవారం బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశంలో ఇది మరోసారి బయటపడింది. ముఖ్యమంత్రి రావడానికి ముందే మౌర్య, మరో ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్ పాఠక్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. అందుకు ముందు కొద్దిసేపు మాట్లాడిన మౌర్య.. ప్రభుత్వంపై తన విమర్శలను పునరుద్ఘాటించారు. పార్టీ కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎన్నికలను ప్రభుత్వాలు గెలవవు. పార్టీలు గెలుస్తాయి’ అని మౌర్య అన్నారు. ప్రభుత్వం కంటే పార్టీయే పెద్దదని పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో విజయాలకు పార్టీ బలమే కీలకమని చెప్పారు. అతి విశ్వాసం వల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్నారు. విశ్వేశ్వరయ్య ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, జల్‌శక్తి మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.
రెండువారాల క్రితం కూడా మౌర్య ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం కంటే పార్టీయే ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ముఖ్యమంత్రికి, మౌర్యకు మధ్య విభేదాలను బయటపెట్టాయి.