Site icon vidhaatha

జోరుగా ‘ఉప రాష్ట్రపతి’ ప్రచారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (విధాత): ఉప రాష్ట్రపతి పదవికి ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార, విపక్షాల తరఫు అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే తరఫున సీపీ రాధాకృష్ణన్‌, ఇండియా కూటమి అభ్యర్థిగా రిటైర్డ్‌ జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఇద్దరు అభ్యర్థులూ అన్ని రాష్ట్రాలూ తిరుగుతూ ఆ యా పార్టీల మద్దతు కోరుతున్నారు. అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలతో అప్పటి ఉపరాష్ట్రపతి జగ్డీప్‌ ధన్‌ఖడ్‌ను ప్రభుత్వం రాజీనామా చేయించిందనే వాదనలు తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ఓడిపోతే ఏం జరుగుతుంది? ప్రభుత్వం పడిపోతుందా? లేక ఎవరైనా రాజీనామా చేయాల్సి ఉంటుందా? ప్రభుత్వానికి ఎదురయ్యే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

NDA అభ్యర్థి ఓడితే?
ఉపరాష్ట్రపతి ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతే రాజకీయాల్లో సంచలనాలకు దారి తీస్తుంది. దాని వల్ల కేంద్ర ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదు.. ప్రధాని కూడా రాజీనామా చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని తేటతెల్లం అవుతుంది. పైగా ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గానూ వ్యవహరిస్తారు కనుక.. విపక్షాల అభ్యర్థి ఎన్నికతే.. ప్రతిపక్షాల సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అధికార పార్టీ బిల్లులు వీగిపోయే అవకాశాలు ఉంటాయి. రాజ్యసభలో బిల్లులను ఆమోదించడం మొదలుకుని, పాలనా పరమైన నిర్ణయాలను అమలు చేయడం వరకూ అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అధికార పార్టీ అభ్యర్థి ఓటమితో ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏమీ లేకపోయినా దేశ రాజకీయాల్లో గణనీయమైన ప్రభావం కనిపిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందనే ప్రచారంతో పాటు అధికార పార్టీపై వేలెత్తి చూపే అవకాశాలుంటాయని చెబుతున్నారు. మున్ముందు జరగబోయే ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపగలదని అంటున్నారు.

విజయానికి ఎన్ని ఓట్లు కావాలి?
ఉపరాష్ట్రపతి అభ్యర్థి విజయానికి 391 ఓట్లు అవసరం. పార్లమెంటులో ఎన్డీయే కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది. ప్రస్తుతం రాజ్యసభ, లోక్‌సభలో మెత్తం సభ్యుల సంఖ్య 788. ఈ లెక్కన ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌ విజయం లాంఛనమే అయినా, రెండు కూటములలోనూ లేనివారు 50 మంది వరకూ ఉండటం, పైగా ఎన్నిక రహస్య బ్యాలెట్ ప్రకారం జరుగుతుండటంతో ఫలితాలపై ఉత్కంఠ సహజమే అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఎలక్టోరల్ కాలేజీ అంటే
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 66 ప్రకారం పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. రాజ్యసభ నుంచి 233 మంది ఎన్నికైన సభ్యులతో పాటు మరో 12మంది నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులకు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది.

ప్రస్తుతం రాజ్యసభలో 5, లోక్‌సభలో 1 స్థానం ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 782 మంది ఉప రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగా కాకుండా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి సభ్యుడి ఓటు విలువ సమానంగా ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనే అవకాశం ఉండటం వల్ల ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా ఓటు విలువ నిర్ధారిస్తారు.

Exit mobile version