న్యూఢిల్లీ : రాజకీయ నాయకుల వస్త్రధారణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కొందరు వీటిని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇండియా టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వస్త్రధారణపై యోగి మాట్లాడారు. ‘నేను ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్లినా ఒకే తరహా దుస్తులు ధరిస్తాను. సభల్లో కూడా అదే దుస్తులతో పాల్గొంటాను. దేశ విదేశాల్లో ఎక్కడికైనా ఇవే దుస్తులతో వెళతాను. కొందరు ఉంటారు.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు వేర్వేరు దుస్తులు ధరించి జనాలను వెర్రోళ్లను చేస్తుంటారు. ఇదేమీ సినిమా కాదు కదా.. ప్రతి సందర్భానికీ డ్రస్సులు మార్చడానికి’ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీని దృష్టిలో ఉంచుకునే యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల్లో పలువురు వ్యక్తం చేస్తున్నారు.
నరేంద్రమోదీ వస్త్రధారణ తరచూ వివాదాస్పదమవుతుంటుంది. ఒకే రోజు వేర్వేరు సందర్భాల్లో దుస్తులు మార్చిన సందర్భాలు ఉన్నాయని పలువురు గుర్తు చేస్తున్నారు. తాను ధరించే డ్రస్సుల విషయంలో ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఒక దశలో ఆర్టీఐ ద్వారా ఒక సమాచార హక్కు కార్యకర్త మోదీ దుస్తుల ఖర్చుపై ప్రధాని కార్యాలయాన్ని ప్రశ్నించారు కూడా. అయితే.. తన దుస్తుల ఖర్చు ప్రధానే భరిస్తారని, ప్రభుత్వం భరించదని పీఎంవో సమాధానం ఇచ్చింది. గతంలో ప్రధానులుగా ఉన్న మన్మోహన్ సహా పలువురు సాధారణ రాజకీయ నాయకుల తరహాలో తెల్లని కుర్తా పైజామా ధరించేవారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయా సందర్భాల్లో అనేక రకాల డ్రస్సులతో కనిపించారు. ఒక దశలో లక్షల ఖరీదు చేసే సూట్ వేసుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.