విధాత : వైఎస్ షర్మిల బుధవారం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయన సతీమణి, వదిన భారతిని తాడేపల్లి క్యాంపు ఆఫీస్ లో కలిశారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఏయిర్ పోర్టుకు చేరుకున్న షర్మిల అక్కడి నుంచి జగన్ క్యాంపు కార్యాలయంకు కొడుకు, కోడలుతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైయస్ రాజారెడ్డి పెళ్లి పత్రికను జగన్ కు షర్మిల అందచేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. అరగంట పాటు వారి మధ్య మాటమంతి జరిగింది.
జగన్ తో షర్మిల భేటీ సందర్భంలో రాజకీయ అంశాల పైన.. కాంగ్రెస్ లో షర్మిల చేరిక పైన చర్చ వచ్చిందా లేదా అన్న అంశంపై స్పష్టత రాలేదు.. కాగా షర్మిల జగన్ తో భేటీ అనంతరం అదే ప్రత్యేక విమానంలో కాంగ్రెస్ లో చేరిక విషయమై ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు ఇదే రోజున కాకినాడ సభలో జగన్ మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో కుట్రలు.. కుతంత్రాలు జరుగబోతున్నాయని.. పొత్తుల కోసం కుటుంబాలను కూడా చీల్చుతున్నారని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి. షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్న నేపధ్యంలోనే జగన్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నారు.