Site icon vidhaatha

Congress: మంత్రి పొంగులేటిపై జంగ్ సైర‌న్‌.. పది మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ?

విధాత, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది వరకు గుంభనంగా ఉన్న ఎమ్మెల్యేలు గ్రూపు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. గత కొద్ది నెలలుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్నారనే చర్చ కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్నది. కేబినెట్‌ మంత్రి అని ఇంత వరకు మౌనంగా ఉన్న స్వపక్ష ఎమ్మెల్యేలు గ్రూపు కట్టి సమావేశం కావడం హాట్‌ టాపిగ్‌ గా మారింది. హైదరాబాద్‌ నగర శివారులో శుక్రవారం సమావేశమై రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వానికి దాదాపు ఆల్టిమేటం ఇచ్చినంత పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్వయంగా వారికి ఫోన్‌ చేసి రావాల్సిందిగా ఆహ్వానించారు.

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రెవెన్యూ శాఖ తో పాటు పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకుని అగ్రభాగాన నిలబెట్టడంలో ఆయన పాత్ర ఉంది. బీఆర్‌ఎస్‌ పార్టీని కోలుకోని విధంగా దెబ్బకొట్టడం, పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో కాంగ్రెస్‌ నాయకత్వం ఆయనకు కీలకమైన శాఖలను అప్పగించింది. గడచిన ఏడాది కాలంగా ఆయన ప్రభుత్వంలో నెంబర్‌ టూ గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చెప్పాల్సిన విషయాలను, ప్రకటించాల్సిన అంశాలను శ్రీనివాస్‌ రెడ్డి చెబుతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అరెస్టు విషయంలో త్వరలో బాంబులు పేలతాయంటూ ఆ మధ్య ప్రకటించడం, అమలు కాకపోవడంతో బాంబులు తుస్సుమన్నాయంటూ పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తమ నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి వేలు పెట్టడమే కాకుండా, పనులు కానిచ్చేసుకుంటున్నారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

నలుగురు కలిసిన సందర్భంలో ఈ విషయం చర్చకు రావడం, ఆ తర్వాత గ్రూపు గా మారి సమావేశమయ్యే పరిస్థితికి నాయకత్వం తీసుకువచ్చిందని అంటున్నారు. ఆయన నియోజకవర్గంలో ఏం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని, మా నియోజకవర్గాల్లో తలదూర్చి భూములు కాజేస్తున్నారనేది అసంతృప్త ఎమ్మెల్యేల ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని కొందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో పది మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా తయారయ్యారని కాంగ్రెస్‌ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్నది. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ప్రకారం… ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకోకపోవడంతో తప్పని పరిస్థితుల్లో శుక్రవారం నాడు వారు సమావేశమై పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఏకపక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, వరంగల్‌ వెస్టు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీ నాయక్‌, నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి, నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు లు సమావేశమయ్యారు. తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూ వ్యవహారాల్లో తలదూర్చి పని ముగించేస్తున్నారనేది వీరి ప్రధాన ఆరోపణ. పదుల కోట్ల రూపాయల విలువైన భూములు చేతులు మారుతుండడం, తమను పూచికపుల్ల మాదిరి చూస్తుండడాన్ని వారిలో అసహనానికి దారి తీసిందని అంటున్నారు. సదరు మంత్రితో తాడోపేడో తేల్చుకోవాలనే ఉద్దేశంతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ విషయం తెలుసుకున్న పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కలిసి చర్చించుకుందాం రండి అని శనివారం ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేశారు. అందరూ పార్టీ నియమావళి ప్రకారం నడుచుకోవాలని, కుటుంబంలో గొడవలు వచ్చిన మాదిరిగానే పార్టీలో గొడవలు ఉంటాయని ఆయన వారితో అన్నారు. కొన్ని నెలలుగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించామని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమావేశమయ్యామని ఒకరిద్దరు కటువుగానే సమాధానమిచ్చినట్లు సమాచారం. జరిగిందేదో జరిగింది, ఇక ముందు జరగకుండా ఏం చేయాలో చర్చిద్దామని ఆయన సదరు ఎమ్మెల్యేలను కోరినట్లు చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలు గ్రూపు కట్టిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావును హుటాహుటిన హైదరాబాద్‌ కు రావాల్సిందిగా శుక్రవారం నాడు కబురు పెట్టారు. ఆయన వెంటనే బయలుదేరి హైదరాబాద్‌ కు చేరుకున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన మాట్లాడి, విషయాన్ని తెలుసుకున్నారని అంటున్నారు.

పది మంది ఎమ్మెల్యేలు సమావేశం కావడం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కొందరు నాయకులు ఢిల్లీలోని పార్టీ పెద్దలకు చేరవేశారు. మంత్రుల ఏకపక్ష వైఖరి కారణంగా ప్రభుత్వం పై చెడ్డపేరు వస్తున్నదని, నియంత్రించాలని ఢిల్లీ పెద్దలకు విన్నవించారని పార్టీలో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇలాంటి భేటీలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తాయని పార్టీ ముఖ్య నాయకులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం నాడు అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమై లోతుగా చర్చించి, దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు. ఎమ్మెల్యేలు కట్టుదాటకుండా ఉండేందుకు వారికి హెచ్చరికలు పంపించవచ్చని, సదరు మంత్రికి కూడా తలంటు పోయవచ్చవని పార్టీ నాయకులు కలిసిన చోట చర్చించుకుంటున్నారు. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ లో ఇవన్నీ సహజమేనని, ఆందోళనకు గురికావాల్సింది ఏదీ లేదని, అన్నీ సర్ధుకుంటాయని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో అవినీతి జరుగుతున్నది. బీఆర్ఎస్, బీజేపీ వాళ్లే ప్రశించాలా! నేను ప్రశ్నించకూడద? ఖచ్చితంగా రెవెన్యూ శాఖలో జరిగే అవినీతి మీద ప్రశ్నిస్తా! అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Exit mobile version