విధాత: ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీగా బంగారం పట్టుబడింది. 18 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ దాదాపు రూ.15 కోట్లకుపైగా ఉంటుందని పోలీసుల అంచనా వేస్తున్నారు. ప్రొద్దుటూరు రామేశ్వరం బైపాస్ రోడ్డులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుంచి తాడిపత్రి వైపునకు వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. అందులో బంగారు అభరణాలను పోలీసులు గుర్తించారు. ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఆదాయపన్ను శాఖ, రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటి విలువను లెక్కించారు. అవన్నీ హైదరాబాద్‌లోని ఓ బంగారం దుకాణానికి చెందినవిగా గుర్తించారు. బంగారు ఆభరణాలతో పాటు లభించిన బిల్లులపై పోలీసులు విచారణ చేస్తున్నారు.