విధాత, వరంగల్ ప్రతినిధి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిని 12 మంది నకిలీ రైతుల పేర్లతో కాజేస్తున్న 22 మంది ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఉన్నారని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బెజ్జంకి శ్రీనివాస్.. రబీ సీజన్ సమయంలో బండ లలితతో పరిచయం ఏర్పరచుకొని, ఆమెతో పాటు ట్యాబ్ ఆపరేటర్ చరణ్ సింగ్ సహకారంతో నకిలీ పంట వివరాలు నమోదు చేసి, ప్రభుత్వ నిధులను అక్రమంగా పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు (బండ లలిత, చరణ్ సింగ్) ఒక్కో క్వింటాకు రూ.120 చొప్పున కమీషన్, బెజ్జంకి శ్రీనివాస్ ఒక్కో క్వింటాకు రూ.500 బోనస్, రూ.50 మిల్లింగ్ చార్జీ రూపంలో లాభం పొందేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
మొత్తం 8,049 క్వింటాళ్లపై రూ. 2.10 కోట్లు విలువైన నిధులు అక్రమంగా పొందినట్లు తేలింది. ఇందులో భాగంగా బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులు, బంధువులు 12 మందిని నకిలీ రైతులుగా చూపించి, శాయంపేట మండల పరిధిలోని 278 ఎకరాల ప్రభుత్వ పోడు భూమిలో వరి పంట పండించినట్లు తప్పుడు వివరాలు సమర్పించారు. టోకెన్ బుక్స్ నకిలీగా రాసి, మండల ఏఈఓ, ఏఓ లాగిన్ ఐడీ ల ద్వారా నకిలీ ఎంట్రీలు చేశాడు.దాంతో ప్రభుత్వ కార్పొరేషన్ నిధి నుండి ఈ నకిలీ రైతుల 12 మంది అకౌంట్లలో రూ.1.86 కోట్లు, అదనంగా బండ లలిత, చరణ్ సింగ్, బండ రజినీకర్ రెడ్డి అకౌంట్లలో రూ.24 లక్షలు జమ అయ్యాయి. మొత్తం 15 మంది పేర్లపై 314 ఎకరాలకు, 9,100 క్వింటాళ్లకు గాను రూ.2.10 కోట్లు మోసపూరితంగా పొందినట్లు నిర్ధారణ అయింది.
నిందితుల లాభం :
బండ లలిత, చరణ్ సింగ్ ఒక్కో క్వింటాకు రూ.120 చొప్పున మొత్తం రూ.10.92 లక్షలు. బెజ్జంకి శ్రీనివాస్ — బోనస్ రూ.500 చొప్పున రూ.45 లక్షలు, మిల్లింగ్ చార్జ్ రూ.50 చొప్పున రూ.4.5 లక్షలు, తర్వాత బెజ్జంకి శ్రీనివాస్ రూ.1.32 కోట్లు డ్రా చేసి, అందులో భాగంగా రూ.32 లక్షలు (రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి) వెచ్చించి కమలాపూర్ మండలం, పంగిడిపల్లి గ్రామం, సర్వే నం.25/ఎఫ్ లో ఒక ఎకరం భూమి తన కుమారులు బెజ్జంకి పున్నం చారి, బెజ్జంకి శివ కుమార్ పేర్లపై కొనుగోలు చేశాడు. రూ.8 లక్షలు వెచ్చించి టాటా నెక్సాన్ (టీఎస్ 08 జేఆర్ 2471) కారు కొనుగోలు చేశాడు.రూ.1.06 కోట్లు ఖర్చు చేసి గత సీజన్, ప్రస్తుత సీజన్ షార్టేజ్ ధాన్యం కొనుగోలు చేశారు. లారీ ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ సుదాటి రాజేశ్వర్ రావు రూ.4 లక్షలు సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌కు తిరిగి చెల్లించాడు. దర్యాప్తు సమయంలో రూ.54 లక్షలు నిందితుల బ్యాంక్ అకౌంట్లలో ఫ్రీజ్ చేయబడ్డాయి. అదనంగా రూ.9.50 లక్షల నగదు, రూ.8 లక్షల విలువైన టాటా నెక్సాన్ కారు,ఆర్సీ, రూ.32 లక్షల విలువైన భూమి పత్రాలు స్వాధీనం చేయబడ్డాయి. దర్యాప్తు లో భాగంగా మొత్తం రూ.1,07,84,134/- విలువైన ఆస్తులు, నగదు స్వాధీనం చేయడం జరిగిందని డీసీపీ తెలిపారు.