Site icon vidhaatha

WARANGAL: కనీవినీ ఎరుగని రీతిలో.. BRS రజతోత్సవ సభ

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులంతా కలిసివచ్చి ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. సభ నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో నిర్వహించనున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ నాయకులు.. అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మండలి ఎల్వోపి ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు తాటికొండ రాజయ్య, సత్యవతి మాజీ ఎంపీ కవిత,, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకటరమణా రెడ్డి, నరేందర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ రావు, గండ్ర జ్యోతి, నాగ జ్యోతి ఇతర వరంగల్ ముఖ్య నేతలతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, వంశీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

సభ సక్సెస్‌కు సర్వ శక్తులు

ఈ సందర్బంగా వరంగల్ నేతలు మాట్లాడుతూ అధినేత ఆదేశాలతో ఉద్యమ సమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేశామని అన్నారు. వరంగల్ లో సభా నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని తమ ఆనందం వ్యక్తం చేశారు. రజతోత్సవ మహా సభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద 1,213 ఎకరాల స్థలాన్ని మహా సభకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఇందులో 154 ఎకరాలు మహా సభ ప్రాంగణం ఉంటుందన్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు ఇందులో దాదాపు 50,000 ఎకరాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది అన్నారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడంతో కనీవినీ ఎరుగని రీతిలో మహసభను నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా నేతలు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని తెలిపారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు.

Exit mobile version